Reading Time: < 1 minute
Medchal Terror Link Case Man Arrested Over Suspected Isi Connections In Hyderabad

Terrorist Arrest: మేడ్చల్ జిల్లాలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో జాహెద్ ఖాన్ అనే వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం అతడిని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.

పోలీసుల అందించిన సమాచారం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ కు చెందిన జాహెద్ ఖాన్ మేడ్చల్ ప్రాంతంలోని ముబారక్ హోటల్‌లో పనిచేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనుమానిత వ్యక్తులతో అతడు సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పాకిస్తాన్ ఐఎస్ఐ సంస్థకు చెందిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్లు అనుమానాలు ఉన్నాయి.

నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాట్సాప్ చాట్‌లు, వాయిస్ కాల్స్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, స్క్రీన్‌షాట్లను కూడా పరిశీలిస్తున్నారు. ఆయుధాలు సమకూర్చుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం రావడంతో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. అదేవిధంగా జాహెద్ ఖాన్ వద్ద నుంచి రెండు నకిలీ పిస్టల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడు హైదరాబాద్‌లో లేదా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఏదైనా విధ్వంసానికి ప్రణాళిక రచించాడా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో జాహెద్ ఖాన్‌కు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? అతడికి సహకరించిన వారు ఎవరైనా ఉన్నారా? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.