Reading Time: 2 minutes
Kl Rahul Creates Ipl History With Unique Six Hitting Record For Three Franchises

KL Rahul IPL Record: స్టార్‌ ప్లేయర్‌ కేఎల్‌ రాహుల్‌ ఐపీఎల్ 2026 సీజన్‌లో మరోసారి తన క్లాస్‌ను నిరూపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన రాహుల్, ఈ సీజన్‌లో దాదాపు 600 పరుగులు చేసి జట్టుకు ప్రధాన బలంగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన రాహుల్, ఐపీఎల్ చరిత్రలో ఎవరూ సాధించని అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాహుల్ కేవలం 30 బంతుల్లోనే 60 పరుగులు చేసి ఢిల్లీకి భారీ స్కోరు అందించాడు. తన ఇన్నింగ్స్‌లో నాలుగు భారీ సిక్సర్లు బాదిన ఆయన, ఈ సీజన్‌లో మొత్తం 31 సిక్సర్లు పూర్తి చేశాడు.

మూడు వేర్వేరు ఫ్రాంచైజీలకు 30కిపైగా సిక్సర్లు
ఈ ఘనతతో కేఎల్ రాహుల్ ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 30కిపైగా సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటికే పంజాబ్‌ కింగ్స్‌ తరఫున 2018, 2021 సీజన్లలో వరుసగా 32, 30 సిక్సర్లు బాదిన రాహుల్, LSG తరఫున 2022లో 30 సిక్సర్లు పూర్తి చేశాడు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌ కోసం 31 సిక్సర్లు కొట్టి తన పేరిట చారిత్రక రికార్డును నమోదు చేసుకున్నాడు.

ఢిల్లీకి పరామర్శ విజయం
ప్లేఆఫ్స్ అవకాశాలు కోల్పోయిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది ఓ పరామర్శ విజయం మాత్రమే అయింది. ఇప్పటికే రాజస్థాన్‌ రాయల్స్‌ చివరి ప్లేఆఫ్స్ స్థానాన్ని ఖాయం చేసుకోవడంతో ఈ మ్యాచ్ కేవలం లాంఛనప్రాయంగా మారింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 203/5 పరుగుల భారీ స్కోరు చేసింది. రాహుల్ 60 పరుగులతో మెరవగా, డేవిడ్ మిల్లర్ 28, ఆశుతోష్ శర్మ 18 పరుగులతో చివర్లో వేగంగా ఆడారు.

204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా ఒక దశలో గెలుపు దిశగా కనిపించింది. 13.1 ఓవర్లకు 128/3 స్కోరుతో ఉన్న కేకేఆర్‌కు చివరి 41 బంతుల్లో 76 పరుగులు అవసరమయ్యాయి. కెప్టెన్ రహానె అర్ధశతకంతో క్రీజులో నిలకడగా ఆడుతున్న సమయంలో మ్యాచ్ మలుపు తిరిగింది. కుల్‌దీప్‌ యాదవ్‌ కీలక వికెట్లు తీసి కేకేఆర్ పతనానికి శ్రీకారం చుట్టగా, అక్షర్‌ పటేల్‌, Lungi Ngidi కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. చివరకు కేకేఆర్ 163 పరుగులకు ఆలౌట్ అయి 40 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయినా, కేఎల్ రాహుల్ ప్రదర్శన మాత్రం ఈ సీజన్‌లో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.