Reading Time: < 1 minute
West Bengal Holding Centers For Illegal Immigrants Bangladeshis Rohingyas

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో తిష్టవేసిన అక్రమ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను తిరిగి వారి దేశాలకు పంపించివేసేందుకు (డిపోర్ట్) వీలుగా ప్రత్యేక ‘హోల్డింగ్ సెంటర్లు’ ఏర్పాటు చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కీలక నిర్ణయానికి సంబంధించి పశ్చిమ బెంగాల్‌లోని అన్ని జిల్లాల కలెక్టర్లకు (డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లు) ప్రభుత్వం లిఖితపూర్వక ఆదేశాలు, మార్గదర్శకాలను జారీ చేసింది. తమతమ పరిధుల్లో ఈ హోల్డింగ్ సెంటర్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను తక్షణమే గుర్తించాలని, తదుపరి చర్యలను వేగవంతం చేయాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా సరిహద్దు జిల్లాలు, అక్రమ వలసదారులు ఎక్కువగా ఆశ్రయం పొందే ప్రాంతాలపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.

డిపోర్ట్ చేసే వరకూ అక్కడే భద్రత
రాష్ట్రంలో పట్టుబడే అక్రమ వలసదారులపై కఠిన నిఘా ఉంచడమే ఈ హోల్డింగ్ సెంటర్ల ముఖ్య ఉద్దేశం అని ప్రభుత్వం చెప్పింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పట్టుబడే అక్రమ బంగ్లాదేశీయులను, రోహింగ్యాలను నేరుగా జైలుకు పంపకుండా, ఈ ప్రత్యేక సెంటర్లకు తరలిస్తారని చెప్పారు. సదరు విదేశీయుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కావడం, వారిని చట్టబద్ధంగా స్వదేశానికి పంపించేందుకు అవసరమైన డాక్యుమెంటేషన్ పూర్తయ్యేంత వరకు వారిని ఈ హోల్డింగ్ సెంటర్లలోనే ఉంచుతారని వెల్లడించారు.

ఎన్నికల హామీ అమలు దిశగా ప్రభుత్వం..
ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఈ అంశాన్ని ప్రధాన అజెండాగా మార్చుకుంది. రాష్ట్రంలో అక్రమ వలసలను పూర్తిగా అరికడతామని ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చారు. నాటి ప్రచార సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. అసోంలో చొరబాట్లను ఏ విధంగానైతే అడ్డుకున్నామో, బెంగాల్‌లోనూ అదే రీతిలో అక్రమ వలసలకు అడ్డుకట్ట వేస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో.. ఎన్నికల హామీని అమలు చేసే దిశగా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.