Reading Time: < 1 minute
Stray Dog Steals Bag With %e2%82%b91 Lakh Cash From Bike In Ups Bijnor Shocking Cctv Video Goes Viral

Dog Steals Cash: మనుషులు దొంగతనం చేయడం విన్నాం.. కోతులు వస్తువులు ఎత్తుకెళ్లడం చూశాం.. కానీ ఒక కుక్క ఏకంగా లక్ష రూపాయల నగదు ఉన్న సంచిని నోటకరచుకుని మాయమైన వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఈ వింత దొంగతనం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగిందంటే.. బిజ్నోర్‌ జిల్లాకు చెందిన ఒక వ్యాపారవేత్త బ్యాంకు నుంచి రూ. లక్ష నగదును విత్‌డ్రా చేసి, వాటిని ఒక నల్లటి సంచిలో పెట్టుకుని, పనిమీద మార్కెట్‌కు వచ్చారు. మార్గమధ్యలో నగరంలోని ఖిలా వాలీ మసీదు వద్ద నమాజ్ చేయడం కోసం ఆగారు. తొందరపాటులోనో లేదా అజాగ్రత్త వల్లనో కానీ, రూ.లక్ష నగదు ఉన్న ఆ సంచిని తన బైక్‌పైనే వదిలేసి మసీదు లోపలికి వెళ్లారు.

ఎంట్రీ ఇచ్చిన కుక్క..
అతను లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే అక్కడికి ఒక వీధి కుక్క వచ్చింది. బైక్ హ్యాండిల్‌కు వేలాడుతున్న నల్లటి సంచిని చూసి, అందులో ఏదైనా తినే పదార్థం ఉందేమోనని ఆ కుక్క భ్రమపడింది. అంతే.. నేరుగా బైక్ వద్దకు వెళ్లి, ఆ సంచిని నోటితో పట్టుకుని లాగేసింది. వాస్తవానికి ఆ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో, ఆ రూ.లక్ష ఉన్న బ్యాగ్‌తో అక్కడి నుంచి దర్జాగా చెక్కేసింది. నమాజ్ ముగించుకుని బయటకు వచ్చిన ఆ వ్యాపారికి బైక్ పై డబ్బు సంచి కనిపించకపోయేసరికి గుండె ఆగినంత పనైంది. ఎవరో దొంగలు ఎత్తుకెళ్లారని అనుకొని ఆ పరిసర ప్రాంతాలన్నీ వెతికాడు. కానీ పాపం అతనికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. చివరకు మసీదు వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఒక నల్లటి కుక్క వచ్చి ఆ బ్యాగ్‌ను నోటకరచుకుని వెళ్లడం చూసి బాధితుడితో పాటు స్థానికులు కూడా అవాక్కయ్యారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీటీవీ ఆధారంగా కుక్క వెళ్లిన దారిలో గాలింపు చేపట్టారు. అయితే ఆ కుక్క ఆ బ్యాగ్‌ను ఎక్కడైనా పడేసిందా? లేక ఎవరైనా దాన్ని తీసుకున్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఆ ఖతర్నాక్ కుక్క గానీ, ఆ నగదు సంచి ఆచూకీ గానీ దొరకలేదని చెప్పారు.