Reading Time: < 1 minute
Tenali Woman Dies By Suicide Attempt Alleging Police Harassment In Gold Recovery Case

Tenali: గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెనాలికి చెందిన తిరుపతమ్మ అనే మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం ప్రకారం.. తెనాలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసు విషయంలో బంగారం రికవరీ కోసం పోలీసులు తనను స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారని తిరుపతమ్మ ఆరోపించింది. ఈ మేరకు ఆమె సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేసింది.

కొన్ని సంవత్సరాల క్రితం కొత్తపేట ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో భర్తతో కలిసి వాచ్‌మన్‌గా పనిచేసిన తిరుపతమ్మపై, అదే అపార్ట్‌మెంట్‌లో నివసించే ఓ మహిళ బంగారం ఇచ్చానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, చేయని నేరంలో ఇరికించి వేధింపులకు గురి చేస్తున్నారని తిరుపతమ్మ సెల్ఫీ వీడియోలో పేర్కొంది. పోలీసుల ఒత్తిడి, మానసిక వేధింపులు తట్టుకోలేక గడ్డి మందు తాగి శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆమెను వెంటనే గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.దీనితో తిరుపతమ్మ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.