Reading Time: < 1 minute
Pil Filed In Supreme Court Seeking Cbi Probe Into Tamil Nadu Trust Vote Allegations

CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మరో పెద్ద షాక్ తగిలింది. ప్రభుత్వ విశ్వాస పరీక్షలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ పిల్‌లో విశ్వాస పరీక్ష సమయంలో ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపించి మద్దతు కూడగట్టారని ఆరోపించారు. ముఖ్యంగా మైనారిటీలో ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తే కీలక పదవులు, ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామని ఆశ చూపినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. విశ్వాస పరీక్షలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవినీతి, రాజకీయ ఒత్తిళ్లు, అక్రమాలపై నిజానిజాలు వెలికితీయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, విచారణ పూర్తయ్యే వరకు తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని కూడా పిల్‌లో డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం నైతికంగా మెజారిటీ కోల్పోయిందని, రాజ్యాంగ పరిరక్షణ కోసం కేంద్రం జోక్యం అవసరమని పిటిషన్‌లో వాదించారు. ఈ పిల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొన్న వేళ, ఈ పరిణామం తమిళనాడు రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.