Reading Time: < 1 minute
Couple From Haryana Got Married After Undergoing An Hiv Test And Receiving Negative Result

పెళ్ళి విషయంలో చాలా మంది అందం, ఆస్తులు, అంతస్తులు చూస్తుంటారు. కానీ కాలం మారే కొద్ది వివాహాల విషయంలో ఆలోచనలు మారుతున్నాయి. నేటి రోజుల్లో ఉద్యోగమే కాదు.. హెల్త్ స్టేటస్ కూడా ముఖ్యమే అని నిరూపిస్తున్నారు కొందరు వధూవరులు. తాజాగా హర్యానాలో ఓ ప్రత్యేకమైన పెళ్లి జరిగింది. వధూవరులిద్దరు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఆ హెల్త్ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చర్ఖీ దాద్రీ జిల్లాలో జరిగిన ఈ వివాహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

నూతన వధూవరులు సాంప్రదాయ ఆచారాలు, అట్టహాసాలకు దూరంగా ఉంటూ, పెళ్లికి ముందు హెచ్‌ఐవి పరీక్ష చేయించుకున్నారు. నెగటివ్ ఫలితం వచ్చిన తర్వాత, డాక్టర్ బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ చిత్రపటం ముందు ఒకరినొకరు జీవిత భాగస్వాములుగా స్వీకరించారు. ఈ ప్రత్యేకమైన వివాహంలోని అత్యంత విశేషమైన అంశం ఏమిటంటే, ఇది పూర్తిగా కట్నం రహితంగా, నిరాడంబరంగా జరిగింది. ఆర్భాటాలు లేవు, సాంప్రదాయ వివాహ ఆచారాలు లేవు. వేదికపై, వధూవరులు గులాబీల బదులుగా ఒకరికొకరు పెన్నులను బహూకరించుకుని, విద్య, అవగాహన సందేశాన్ని సమాజానికి చాటిచెప్పారు.

చార్ఖీ దాద్రీ నివాసితులైన మనేంద్ర దహియా, మోనికా తన్వార్ వృత్తిరీత్యా కౌన్సిలర్లు. వివాహం అనేది కేవలం ఒక సామాజిక ఆచారం మాత్రమే కాదని, అది నమ్మకం, బాధ్యతతో కూడిన బంధమని వారిద్దరూ తెలిపారు. అందుకే వివాహానికి ముందు ఆరోగ్య పరీక్షలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. సురక్షితమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్ధారించుకోవడానికి యువత సంకోచం లేకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వరుడు మనేంద్ర దహియా కోరారు. హెచ్‌ఐవి వంటి సమస్యలపై సమాజంలో ఇప్పటికీ బహిరంగంగా చర్చ జరగడం లేదని, అవగాహనే ఉత్తమ రక్షణ అని మోనికా తన్వర్ అన్నారు. ఈ వధూవరులు తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది.. ఆదర్శవంతమైన ఈ వివాహంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.