Reading Time: 2 minutes

టెక్నాలజీ గానీ లేని కాలంలో సుమారు 4,500 ఏళ్ల క్రితం, మనుషులు ఆకాశాన్ని తాకే అంత ఎత్తులో అద్భుతమైన కట్టడాలను ఎలా నిర్మించారు? అదే ఈజిప్ట్‌లోని గిజా పిరమిడ్ల రహస్యం. 23 లక్షల భారీ రాళ్లతో, నక్షత్రాల దిశలకు అనుగుణంగా నిర్మించిన ఈ కట్టడం నేటికీ సైంటిస్టులకు ఒక అంతుచిక్కని సవాలుగా నిలిచింది. ప్రపంచ ఏడు వింతల్లో చెక్కుచెదరకుండా ఉన్న ఏకైక ప్రాచీన అద్భుతం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

భారీ రాళ్ల మిస్టరీ: పిరమిడ్ నిర్మాణంలో ఉపయోగించిన ఒక్కో రాయి బరువు 2 నుండి 10 టన్నుల వరకు ఉంటుంది. అసలు అంత బరువున్న రాళ్లను వేల అడుగుల ఎత్తుకు ఎలా తీసుకెళ్లారు? ఏనుగులు, గుర్రాలు కూడా లేని ఆ కాలంలో కేవలం మానవ శ్రమతోనే ఇది సాధ్యమైందా అంటే నమ్మడం కష్టమే.ఇక  ఇసుకపై నీళ్లు చల్లి రాళ్లను జారేలా చేశారని కొందరు అంటుంటే, మరికొందరు ఏదో రహస్య సాంకేతికత వాడారని నమ్ముతారు.

దిశల అద్భుతం: గిజా పిరమిడ్ సరిగ్గా ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర దిక్కులను సూచిస్తుంది. నేడు మన దగ్గర కంపాస్, జీపీఎస్ ఉన్నాయి కాబట్టి దిశలు తెలుస్తాయి. కానీ వేల ఏళ్ల క్రితం ఎటువంటి పరికరాలు లేకుండా ఇంత ఖచ్చితంగా దిశలను ఎలా గుర్తించారనేది శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచే విషయం. ఇక ఇది కేవలం ఇంజనీరింగ్ మాత్రమే కాదు, గొప్ప ఖగోళ శాస్త్రం కూడా.

The Great Pyramid of Giza – The Only Surviving Wonder of the Ancient World
The Great Pyramid of Giza – The Only Surviving Wonder of the Ancient World

ఆకాశంలోని నక్షత్రాలతో సంబంధం: మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇక్కడ ఉన్న మూడు ప్రధాన పిరమిడ్ల అమరిక ఆకాశంలోని ‘ఓరియన్స్ బెల్ట్’ (Orion’s Belt) అనే నక్షత్రాల సమూహాన్ని పోలి ఉంటుంది. ఇక చనిపోయిన రాజుల ఆత్మలు నేరుగా నక్షత్ర మండలంలోకి వెళ్లడానికే ఇలా ప్లాన్ చేసి నిర్మించారని పరిశోధకుల నమ్మకం. అంతేకాక లోపల ఉండే కింగ్స్ ఛాంబర్, క్వీన్స్ ఛాంబర్ గదులు కూడా అద్భుతమైన గాలి వెలుతురు వచ్చేలా రూపొందించబడ్డాయి.

కేవలం 20 ఏళ్లలోనేనా?: దాదాపు 2.3 మిలియన్ల రాళ్లను అమర్చడానికి కొన్ని వందల ఏళ్లు పడుతుందని మనం అనుకుంటాం. కానీ ఈ భారీ నిర్మాణాన్ని కేవలం 20 ఏళ్లలోనే పూర్తి చేశారట. అంటే ప్రతి కొన్ని నిమిషాలకు ఒక రాయిని పేర్చుకుంటూ వెళ్లాలి. ఇక ఇది ఆ కాలపు కార్మికుల క్రమశిక్షణకు, అంకితభావానికి నిదర్శనం. నేటికీ పిరమిడ్ లోపల ఇంకా బయటపడని రహస్య గదులు, సొరంగాలు ఎన్నో ఉన్నాయని భావిస్తున్నారు.

గిజా పిరమిడ్ కేవలం ఒక సమాధి మాత్రమే కాదు, అది ప్రాచీన మానవుల మేధస్సుకు ఒక సజీవ సాక్ష్యం. కాలం మారుతున్నా, నాగరికతలు మారుతున్నా ఈ పిరమిడ్లు మాత్రం గంభీరంగా నిలబడి మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి.

The post ఏడు వింతలలో మహా వింత.. గిజా పిరమిడ్ గొప్పతనం appeared first on Manalokam – Latest Telugu News & Updates.