July 12, 2026

Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..

Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
Reading Time: < 1 minute
Minister Narayana Makes Key Remarks On Vizag Vijayawada Metro Projects

Vizag, Vijayawada Metro Projects: విశాఖపట్నం, విజయవాడ నగరాల మెట్రోరైల్ ప్రాజెక్టులపై మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే రివైజ్డ్ డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించామని, ప్రస్తుతం సానుకూల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. విశాఖ పర్యటనలో భాగంగా మంత్రి నారాయణ ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కైలాసగిరి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు వీఎంఆర్‌డీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పర్యాటకులను మరింత ఆకర్షించేలా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి కైలాసగిరిలో ఏర్పాటు చేసిన భారీ త్రిశూల్ ప్రాజెక్టును ప్రారంభించారు మంత్రి నారాయణ… 65 అడుగుల ఎత్తులో, 18 అడుగుల ఢమరుకంతో నిర్మించిన ఈ త్రిశూలం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాత్రివేళల్లో లైటింగ్‌తో ఈ నిర్మాణం మరింత అందంగా కనిపిస్తోంది. ఇప్పటికే కైలాసగిరిలో ఏర్పాటు చేసిన గ్లాస్ బ్రిడ్జ్, జిప్ లైన్, అడ్వెంచర్ స్పోర్ట్స్ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. దేశంలోనే సముద్రం వైపు నిర్మించిన పొడవైన క్యాంటీలీవర్ కూడా సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. పర్యాటకులకు మరిన్ని కొత్త అనుభూతులు అందించాలన్న లక్ష్యంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈ త్రిశూలం ప్రాజెక్టును అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు. పరమశివుడి ఆయుధమైన త్రిశూలాన్ని ఢమరుకంతో కలిపి ఏర్పాటు చేయడం ద్వారా దీనికి ఆధ్యాత్మికతను కూడా జోడించారు. సుమారు రూ.2.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును సముద్ర మట్టానికి 365 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు. గత ఏడాది ఆగస్టు 18న ప్రారంభమైన ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఇది విశాఖలో మరో ప్రధాన టూరిస్ట్ ఆకర్షణగా మారుతోంది.