July 12, 2026

నీతికథ : మొసలి కన్నీరు .. కపట బుద్ది..చెడు ఆలోచనలు.. పైకి ఏడుపు.. ఇలాంటి వారిని అస్సలు నమ్మొద్దు..!

నీతికథ : మొసలి కన్నీరు .. కపట బుద్ది..చెడు ఆలోచనలు.. పైకి ఏడుపు.. ఇలాంటి వారిని అస్సలు నమ్మొద్దు..!
Reading Time: 2 minutes

నీతికథ : మొసలి కన్నీరు .. కపట బుద్ది..చెడు ఆలోచనలు.. పైకి ఏడుపు.. ఇలాంటి వారిని అస్సలు నమ్మొద్దు..!

Caption of Image.

​ఒకరోజు సాయంత్రం తాతయ్య వరండాలో కుర్చీలో కూర్చుని ఉండగా, మనవరాలు ఉజ్వల, మనవడు శరత్ పరుగున వచ్చి ఆయన పక్కన చేరారు. ‘‘తాతయ్యా.. ఇందాక టీవీలో ఒకాయన రాజకీయ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని అంటుంటే విన్నాం. అసలు మొసళ్లు కూడా మనలాగే ఏడుస్తాయా?’’ అని అడిగింది ఉజ్వల సందేహంగా. తాతయ్య నవ్వి, ‘‘అవునమ్మా! మొసళ్లు ఏడుస్తాయి. కానీ ఆ ఏడుపు వెనుక ఒక వింత కథ, ఒక శాస్త్రీయ నిజం ఉన్నాయి. చెప్తాను వినండి’’ అంటూ కథ మొదలుపెట్టాడు.

​అనగనగా ఒక పెద్ద మడుగులో ఒక ముసలి మొసలి ఉండేది. అది చాలా తెలివైనది, అంతకంటే ఎక్కువ మోసకారి. .. ఒకరోజు ఒక జింక దాహంతో ఆ మడుగు దగ్గరకు వచ్చింది. ఒడ్డున కదలకుండా పడి ఉన్న మొసలిని చూసి జింకకు అనుమానం వచ్చింది. అది రాయా లేక మొసలా అని తేల్చుకోలేక జింక అక్కడే ఆగిపోయింది. 

జింక తనని గమనిస్తోందని గ్రహించిన మొసలి, తను రాయిలాగే నటించాలని నిశ్చయించుకుని అస్సలు కదలకుండా బిగుసుకుపోయింది. సరిగ్గా అప్పుడే ఒక పావురం ఎగురుకుంటూ వచ్చి, మొసలిని రాయి అనుకుని దాని తల మీద వాలింది. అది చూసిన జింక, ‘‘పావురమే దాని మీద వాలిందంటే అది ఖచ్చితంగా రాయే అయి ఉంటుంది’’ అని నమ్మి, నిశ్చింతగా నీళ్లు తాగడానికి ముందుకు వెళ్లింది.

​జింక తల దించి నీళ్లు తాగుతున్న సమయంలో, మొసలి ఒక్కసారిగా నోరు తెరిచి జింక మీద దాడికి లేచింది. ఆ ఊహించని పరిణామానికి పావురం భయపడి టపటపామని రెక్కలు ఆడిస్తూ ఒక్కసారిగా పైకి ఎగిరిపోయింది. ఆ రెక్కల చప్పుడు విని జింక అప్రమత్తమై, మొసలి నోటికి చిక్కకుండా ఒకే గెంతుతో అడవిలోకి పారిపోయింది. 

ఆహారం దొరకలేదని మొసలి నిరాశతో ఒడ్డుకు వచ్చి కళ్ల వెంట నీళ్లు కార్చసాగింది. అప్పుడే అక్కడికి ఒక నీటి ఏనుగు వచ్చింది. మొసలి కళ్లలో నీళ్లు చూసి అది బాధపడుతోందని భ్రమపడి, ‘‘ఏమైంది మిత్రమా! ఎందుకు ఏడుస్తున్నావు?’’ అని జాలితో అడిగింది.​మొసలి మెల్లగా తన కపట బుద్ధితో.. ‘‘మిత్రమా! నాకు చాలా జబ్బుగా ఉంది. సింహం మాంసం తింటేనే నా జబ్బు తగ్గుతుందని ఒక వైద్యుడు చెప్పాడు. కానీ నాకు వేటాడే శక్తిలేక ఇలా ఆకలితో అలమటిస్తున్నాను’’ అని అబద్ధం చెప్పింది. 

►ALSO READ | ఆధ్యాత్మికం: గురువుస్థానంలో ఉండేవారు జాగ్రత్త వహించాలి..

అమాయకపు నీటి ఏనుగు కరిగిపోయి, ‘‘సరే, ఏడవకు నేను ఎలాగైనా నీ కోసం సింహం మాంసం తెచ్చిపెడతాను’’ అని మాట ఇచ్చింది. ఇదంతా చెట్టు చాటు నుంచి వింటున్న జింక బయటకు వచ్చి, ‘‘నీటి ఏనుగు మిత్రమా! ఆ మొసలి కన్నీళ్లు చూసి మోసపోకు. అది నిన్ను ప్రమాదంలో పడేయాలని చూస్తోంది. సింహం నీళ్ల కోసం వచ్చినప్పుడు నువ్వు దానితో పోరాడితే, మీ ఇద్దరిలో ఎవరు చనిపోయినా ఈ మొసలికి లాభమే. కష్టపడకుండా దానికి ఆహారం దొరుకుతుందని ఇలాంటి నాటకం ఆడుతోంది’’ అని అసలు నిజాన్ని బయటపెట్టింది.

​తాతయ్య పిల్లల వైపు చూస్తూ, ‘‘చూశారా పిల్లలూ! నిజానికి మొసళ్లు మనలా ఏడవ్వు. శాస్త్రీయంగా చూస్తే, మొసళ్లు ఆహారాన్ని నమిలేటప్పుడు, వాటి దవడలను బలంగా కదిలించినప్పుడు వాటి దవడ కండరాలు కంటి దగ్గర ఉండే గ్రంథుల మీద గట్టిగా ఒత్తిడి తెస్తాయి. ఆ ఒత్తిడి వల్ల కళ్ల నుంచి నీరు దానంతట అదే బయటకు వస్తుంది. ఇది ఒక సహజమైన శారీరక ప్రక్రియ మాత్రమే, అంతేకానీ అది జాలిపడి కార్చే కన్నీరు కాదు. 

అందుకే ఎవరైనా లోపల చెడు ఆలోచనలు పెట్టుకుని, పైకి ఏడుస్తూ నటించేవాళ్లను చూసి మన పూర్వీకులు మొసలి కన్నీరు అనే జాతీయాన్ని సృష్టించారు’’ అని వివరించాడు.​అది విన్నాక ఉజ్వల, శరత్​లు.. ‘‘ఓహో! ఇదా అసలు విషయం..’’ అని ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్న సంతోషంతో చప్పట్లు కొట్టారు.

– డా. పోతగాని సత్యనారాయణ-

గమనిక: మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు
featureseditor@v6velugu.com కి మెయిల్​ చేయండి.
===================================

©️ VIL Media Pvt Ltd.