Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!

Harry Brook: ప్రపంచ ఛాంపియన్ అయిన భారత జట్టుకు ఇంగ్లాండ్ గట్టి షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ కాలంగా సాగుతున్న టీమిండియా ఆధిపత్యానికి ఎట్టకేలకు తెరపడింది. ఏకంగా 1,605 రోజుల పాటు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో రారాజుగా వెలిగిన భారత జట్టు, ఆ నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో, ఆఖరి టీ20 మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలవడంతో భారత్ తన టాప్ ర్యాంక్‌ను ప్రత్యర్థి జట్టుకు సమర్పించుకోవాల్సి వచ్చింది. శనివారం సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో సామ్ కరన్, ఆదిల్ రషీద్‌ల అద్భుత బౌలింగ్ ధాటికి భారత్ 56 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఇంగ్లాండ్ 4-0తో క్లీన్‌స్వీప్ చేసింది. డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియాను ఇంగ్లాండ్ అన్ని రంగాల్లోనూ చిత్తు చేయడం గమనార్హం.
అయితే, ఈ సిరీస్ ఫలితం వెనుక ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వేసిన పక్కా ప్లాన్, మైండ్ గేమ్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. చివరి టీ20కి ముందే అతను చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యాయి. అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియాను కిందికి నెట్టి, నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే తమ జట్టు ముందున్న అతిపెద్ద లక్ష్యమని బ్రూక్ ముందే బాంబు పేల్చాడు. తమ తదుపరి లక్ష్యంపై డ్రెస్సింగ్ రూమ్‌లో స్పష్టమైన చర్చ నడుస్తోందని అంగీకరించిన అతను, చెప్పినట్లుగానే భారత్‌ను గద్దె దించి నంబర్ వన్ పీఠాన్ని అధిరోహించాడు. “మేము తదుపరి మ్యాచ్ గెలిస్తే ప్రపంచ నంబర్ వన్‌గా నిలుస్తామని మాకు తెలుసు. కచ్చితంగా ఆ స్థానాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉన్నాం. భారత్ చాలా బలమైన జట్టు. గత రెండేళ్లతో పోలిస్తే ప్రస్తుతం వారు అంతటి అత్యుత్తమ ఫామ్‌లో లేకపోయినప్పటికీ.. వారిపై మా ప్లాన్స్‌ను మేము సరిగ్గా అమలు చేయడం సంతోషంగా ఉంది. భారత్‌పై 4-0తో సిరీస్ గెలవడం చాలా ప్రత్యేకం. ఇక ప్రపంచ నంబర్ వన్ స్థానానికి చేరితే అది అంతకంటే అద్భుతం. అదే మా ప్రధాన లక్ష్యం. చివరి మ్యాచ్‌లోనూ వారిని ఘనంగా ఓడించడానికి ప్రయత్నిస్తాం” అని బ్రూక్ ధీమా వ్యక్తం చేశాడు. అన్న మాట ప్రకారం హ్యారీ బ్రూక్ ఎట్టకేలకు టీమిండియాను నంబర్ వన్ స్థానం నుంచి కిందికి నెట్టేసి, అనుకున్నది సాధించి చూపించాడు.