మాకీపూర్ విలేజ్ మిషన్.. ‘సూపర్ సుబ్బు’ సక్సెస్ అయ్యాడా? సిరీస్ కథ ఇదే!

సెక్స్ ఎడ్యుకేషన్ అనే సున్నితమైన అంశాన్ని వినోదాత్మకంగా, సందేశాత్మకంగా తెరకెక్కించిన సరికొత్త వెబ్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో డిజిటల్ ఆడియన్స్‌ను అలరిస్తోంది. సమాజంలో ఇప్పటికీ మాట్లాడటానికి జంకే ఒక ముఖ్యాంశాన్ని హాస్యంతో జోడించి దర్శకుడు మల్లిక్ రామ్ ఈ సిరీస్‌ను రూపొందించారు.
కథ విషయానికి వస్తే..
సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు (సందీప్ కిషన్) తన తల్లిదండ్రులు, మేనమామతో కలిసి ఉంటాడు. సెక్స్ ఎడ్యుకేషన్‌పై చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్న సుబ్బు, తండ్రి కుక్కుటేశ్వరరావు (మురళీ శర్మ) సాయంతో స్కూల్‌లో తాత్కాలిక ల్యాబ్ అసిస్టెంట్‌గా చేరతాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ఉద్యోగం పోయే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ప్రిన్సిపాల్ మధుసూదనరావు (బ్రహ్మానందం) అతని ఆసక్తిని గుర్తించి, లైంగిక అవగాహన కల్పించే కార్యక్రమం కోసం మాకీపూర్ గ్రామానికి పంపిస్తాడు. అక్కడి ప్రజలు మూఢనమ్మకాలతో జీవిస్తూ, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఏ మాత్రం అవగాహన లేకపోవడం సుబ్బుకు షాక్ ఇస్తుంది.
►ALSO READ | స్మశానంలో దొంగతనం.. ఐదు ఆత్మల వేట.. ఓటీటీలోకి వచ్చేసిన హారర్ కామెడీ ‘కరక్కం’!
మరోవైపు దివ్యతో అతని పెళ్ళి కుదురుతుంది. మాకీపూర్‌లో స్వాతి (మిథిలా పాల్కర్) పరిచయం కావడంతోపాటు, కొందరు ప్రమాదకర వ్యక్తులతో కూడా అతను తలపడాల్సి వస్తుంది. అసలు మాకీపూర్‌లో సుబ్బుకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? వాటిని అతను ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు తన లక్ష్యంలో విజయం సాధించాడా? అనేదే ఈ సిరీస్ కథ.
సందీప్ కిషన్ తనదైన టైమింగ్‌తో ఆకట్టుకోగా, మురళీ శర్మ, బ్రహ్మానందంల నటన సిరీస్‌కు ప్రధాన బలంగా నిలిచింది. ఒక మంచి సోషల్ మెసేజ్‌ను కడుపుబ్బా నవ్వించే కామెడీతో చూడాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ‘సూపర్ సుబ్బు’ను అస్సలు మిస్ కాకండి.