Reading Time: 2 minutes

100 జీసీసీలు.. లక్ష ఉద్యోగాలు.. ఇదే ఈ ఏడాది ప్రభుత్వ టార్గెట్: మంత్రి శ్రీధర్

Caption of Image.
  • ఈ ఏడాది టార్గెట్​గా పెట్టుకున్నాం: మంత్రి శ్రీధర్ బాబు
  • ఆఫీస్ స్పేస్ గానే కాదు.. ఇన్నోవేషన్ సెంటర్​గానూ హైదరాబాద్​ను నిలబెడతామని వెల్లడి 
  • సిటీలో రెండు జీసీసీలను ఏర్పాటు చేయనున్న జర్మన్ సంస్థ బీఏఎస్ఎఫ్ 
  • గ్లోబల్ డిజిటల్ హబ్, గ్లోబల్ సర్వీసెస్ హబ్​లు ఏర్పాటు

హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది 100 గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వీటి ద్వారా లక్ష మంది ఐటీ నిపుణులకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేవలం ఆఫీసులకు కేంద్రంగా కాకుండా ఆవిష్కరణలు, ఇంజినీరింగ్ రంగాల్లో ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. 

ఏఐ ఆధారిత కేంద్రం ఐకామ్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, 200 ఎకరాల్లో ఏఐ సిటీ, క్వాంటమ్ హబ్, జీవవిజ్ఞాన పరిశోధన సంస్థ ‘1 బయోల్యాబ్’లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రసాయనాల తయారీలో ప్రపంచంలోని అతిపెద్ద సంస్థల్లో ఒకటైన జర్మన్ దిగ్గజం బీఏఎస్ఎఫ్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు జీసీసీలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిందన్నారు.

 ఈ రెండు జీసీసీల ద్వారా సుమారు 3 వేల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. గ్లోబల్ డిజిటల్ హబ్, గ్లోబల్ సర్వీసెస్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల పేరుతో నెలకొల్పే ఈ జీసీసీలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం అంగీకార పత్రం సమర్పించినట్లు తెలిపారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తాజ్ వివాంతా హోటల్​లో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, జర్మన్ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్ ల సమక్షంలో బీఏఎస్ఎఫ్ గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హెడ్  టోబియాస్ డ్రాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. తెలంగాణ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైన్సెస్ సీఈఓ సర్వేశ్ సింగ్ కు లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను అందజేశారు.

 ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. “160 ఏండ్ల చరిత్ర కలిగిన బీఏఎస్ఎఫ్ ప్రపంచవ్యాప్తంగా 200లకు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 234 ఫ్యాక్టరీలు, 1.08 లక్షల మంది ఉద్యోగులతో పనిచేస్తున్న ఈ సంస్థ వార్షిక ఆదాయం దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు. ప్రపంచంలోని పలు నగరాలతో పోటీ పడి హైదరాబాద్ ఈ ప్రతిష్ఠాత్మక అవకాశాన్ని దక్కించుకోవడం రాష్ట్రానికి దక్కిన గౌరవం. ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, గూగుల్, వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గార్డ్, ఎలీ లిల్లీ, మారియట్ ఇంటర్నేషనల్ లాంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ జీసీసీలు ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి” అని శ్రీధర్ బాబు తెలిపారు.

10 ఎకరాల్లో విమాన భాగాల తయారీ సంస్థ..

విమానాలకు అత్యంత కీలకమైన విడిభాగాలను తయారు చేసే ప్లాంట్ ను ‘ఐటీపీ ఏరో ఇండియా’ అనే సంస్థ ఏర్పాటు చేయనుంది. శంషాబాద్ లోని హార్డ్ వేర్ పార్క్ (ఫేజ్ 3)లో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ కు మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం భూమి పూజ చేశారు. రూ.453 కోట్ల పెట్టుబడితో 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ లో.. విమాన ఇంజన్ల రిజిడ్ ట్యూబ్స్ కు అవసరమయ్యే ఎండ్-ఫిట్టింగ్స్, బ్రాకెట్లను సంస్థ తయారు చేయనుంది. 2027 నాటికి పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ ప్రారంభం కానున్నాయి. ప్రెసిషన్ ఇంజినీరింగ్, అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో కొత్తగా 350 మందికి(హై స్కిల్డ్) ఉపాధి లభించనుంది. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో 600కు పెరగనుంది.

©️ VIL Media Pvt Ltd.