Reading Time: < 1 minute

మోదీ సభను డైవర్ట్ చేసేందుకే ‘సీబీఐ’ డ్రామాలు : కేంద్ర మంత్రి సంజయ్

Caption of Image.
  • కేసీఆర్​ను అరెస్ట్ చేసే దమ్ము లేదని సీఎం లేఖ రాస్తే కేంద్రం చూసుకుంటుంది: కేంద్ర మంత్రి సంజయ్
  • రైతులు చస్తున్నా వడ్లను కొనుగోలు చేయరా? అని ఫైర్
  •  కరీంనగర్​ జిల్లా ఖాజీపూర్​లో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

కొత్తపల్లి, వెలుగు: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు చోట్ల బీజేపీ విజయం, ఈ నెల 10న పీఎం మోదీ బహిరంగ సభపై చర్చను డైవర్ట్​ చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ పేరుతో డ్రామాలాడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ ఆరోపించారు. కరీంనగర్​జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్​లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించి మాట్లాడారు.

‘విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై ఎంక్వైరీ కమిషన్ నివేదిక ఇచ్చి ఏడాదిన్నర దాటినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? కేసీఆర్​ను అరెస్ట్ చేసే దమ్ము మీకు లేదా? కేసీఆర్​తో ఇన్నాళ్లు బేరసారాలాడారా? బేరసారాలు చెడిపోయాయి కాబట్టే కేంద్రానికి లేఖ రాస్తున్నారా? మా భుజంపై తుపాకీ పెట్టి కేసీఆర్​ను కాల్చాలనుకుంటున్నారా?’అని నిలదీశారు.

రేవంత్ రెడ్డికి కేసీఆర్​ను అరెస్ట్ చేయడం చేతగాదని ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. రేవంత్​రెడ్డికి చేతగాదని ఒప్పుకుని కేంద్రానికి లేఖ రాస్తే సీబీఐ విచారణపై కేంద్రం స్పందిస్తుందన్నారు. 

యుద్ధ ప్రాతిపదికన వడ్ల కొనుగోళ్లు చేపట్టాలి

రైతులు చస్తున్నా వడ్లను కొనుగోలు చేయరా.. ఇంకెంతమంది రైతులను బలిగొంటారని సంజయ్ ​ప్రశ్నించారు. యుద్ధ ప్రాతిపదికన వడ్ల కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్​ చేశారు. ఈ సందర్భంగా తాలు, తరుగు పేరుతో బస్తాకు నాలుగైదు కిలోలు దోచుకుంటున్నారని రైతులు మంత్రికి గోడు వెల్లబోసుకున్నారు. స్పందించిన ఆయన ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

ధాన్యం కొనుగోలుకు కేంద్రమే పైసలిస్తుంటే కొనడానికి రాష్ట్రానికున్న ఇబ్బందేమిటన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలకు వెళ్తే మంత్రులను రైతులు కొట్టేటట్లు ఉన్నారని పేర్కొన్నారు.  తాలు, తరుగు పేర దోచుకుంటున్నా, టోకెన్లు ఇవ్వడానికి కూడా దళారులు కమీషన్లు దండుకుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రవ్నించారు.  ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి పైసల్లేవంటారు.. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వడానికి నిధుల్లేవంటారు.. ఢిల్లీకి కప్పం కట్టడానికి, కేరళ ఎన్నికల కోసం ఖర్చు చేయడానికి వేల కోట్లు ఇస్తారని విమర్శించారు..

 

©️ VIL Media Pvt Ltd.