
చెన్నై: తమిళనాడు ఓటర్లు ఏదో ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీని ఇస్తుంటారు. కానీ, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాలకు గాను, ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు అవసరం. ప్రస్తుతం విజయ్ పార్టీ (టీవీకే) అతిపెద్ద పార్టీగా (108 సీట్లు) అవతరించినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్‌కు మరో 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది.
దీంతో.. తమిళనాడులో ‘హంగ్’ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే.. వాస్తవానికి టీవీకే పార్టీకి ఈ పరిస్థితి వచ్చి ఉండాల్సింది కాదు. తమిళనాడులోని 17 నియోజకవర్గాల్లో విజయ్ టీవీకే పార్టీ అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఈ సీట్లలో స్వల్ప తేడాతో టీవీకే పార్టీ విజయావకాశాలను కోల్పోయింది. తిరుకోవిలూర్, విక్రవాండి, కులితలై, పళని, కోవిల్‌పట్టి, ఊటీ.. ఈ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెయ్యి కంటే తక్కువ ఓట్ల తేడాతో టీవీకే పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. దిండిగల్, కరూర్, పాపనాశం, కిళ్ళియూర్, పుదుకోట్టై, తిరుమయం.. ఈ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో.. రెండు వేల కంటే తక్కువ ఓట్ల తేడాతో టీవీకే అభ్యర్థులు విజయానికి దూరం కావడం గమనార్హం. తిరువణ్ణామలై, యెర్కాడ్, విరుధాచలం, కోయంబత్తూర్ సౌత్, కిల్వెల్లూర్.. ఈ ఐదు నియోజకవర్గాలలో, 2 వేల 500 ఓట్ల తేడాతో టీవీకే గెలుపు అవకాశాలు గల్లంతయ్యాయి.
ALSO READ : విజయ్ రాజీనామా చేసే స్థానం ఇదే..
ఈ 17 నియోజకవర్గాలలో టీవీపీ గెలిచి ఉంటే.. తమిళనాడులో హంగ్ అసెంబ్లీ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. విజయ్ టీవీకే పార్టీనే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేది. అయినా ఇప్పటికీ విజయ్కి సీఎం సీటు కూతవేటు దూరంలోనే ఉంది. కాంగ్రెస్, సీపీఐ, పీఎంకే, డీఎండీకే లాంటి పార్టీల మద్దతు కూడగడితే విజయ్ పార్టీ సులభంగా మ్యాజిక్ ఫిగర్ దాటేయొచ్చు. అయితే.. ఇలా ఇన్ని పార్టీలను కలుపుకొని వెళ్లే బదులు.. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే అన్నా డీఎంకేతో కలిసి వెళ్లే అంశాన్నీ తోసిపుచ్చలేమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.