Reading Time: 2 minutes
Telangana Andhra Hotel Food Prices Hike Commercial Gas Effect

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సామాన్యుడి గొంతులో ‘మంట’ పుడుతోంది. దీనికి ప్రధాన కారణం భారీగా పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు. గత కొద్ది రోజులుగా గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు నిర్వహించడం యజమానులకు కత్తిమీద సాములా మారింది. ముడి సరుకుల ధరలు, లేబర్ ఖర్చులకు తోడు గ్యాస్ భారం తోడవడంతో, ఆ భారాన్ని హోటల్ యాజమాన్యాలు కస్టమర్ల మీదకు మళ్లించాయి. ఫలితంగా మధ్యతరగతి ప్రజలు బయట తినాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.

హోటల్ మెనూలో మంట..
తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లోని హోటళ్లలో ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఒకప్పుడు రూ. 30 నుంచి రూ. 40 మధ్యలో లభించే ఇడ్లీ ప్లేట్ ఇప్పుడు ఏకంగా రూ. 75 కి చేరింది. ఇక దోశ విషయానికి వస్తే.. నెయ్యి లేదా మసాలా దోశ ధరలు రూ. 80 నుంచి రూ. 100 వరకు పలుకుతున్నాయి.

సాధారణ మధ్యతరగతి హోటళ్లలో కూడా ఫుల్ మీల్స్ ధర రూ. 200 కి చేరింది. టీ & కాఫీ విషయానికి వస్తే.. సామాన్యుడికి అందుబాటులో ఉండే టీ ధర కూడా రూ. 15 నుంచి రూ. 20 వరకు పెరిగింది.

ధరల పెరుగుదలకు కారణాలు..
కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడం వల్ల హోటల్ నిర్వహణ వ్యయం 20 శాతం నుంచి 30 శాతం వరకు పెరిగింది. పప్పు దినుసులు, వంట నూనెలు, కూరగాయల ధరలు కూడా భారీగా పెరగడం హోటల్ యజమానులను ఇబ్బందుల్లోకి నెట్టింది. కరెంటు బిల్లులు, షాపుల అద్దెలు , పనివారి జీతాలు పెరగడంతో ధరల పెంపు తప్పనిసరి అని యజమానులు వాదిస్తున్నారు.

ధరల పెరుగుదలపై కస్టమర్లు లబోదిబోమంటున్నారు. ఇంత రేట్లు పెట్టి మేం టిఫిన్స్, భోజనాలు హోటల్స్‌లో తినలేం అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి బయటకు వెళ్లి టిఫిన్ చేయాలన్నా వెయ్యి రూపాయలు సరిపోని పరిస్థితి ఉంది. చాలా మంది బ్యాచిలర్స్, విద్యార్థులు మెస్ ధరలు పెరగడంతో ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. అంతే కాకుండా.. కొన్ని హాస్టల్స్ వచ్చే నెల నుంచి రెంట్స్ కూడా పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్యాస్ ధరలను నియంత్రించాలని కోరుతున్నారు. ధరల పెరుగుదల వల్ల సామాన్యుడి నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది, ఇది ఇలాగే కొనసాగితే పేద ప్రజల ఆకలి తీరడం కష్టంగా మారనుంది.