
తృణధాన్యాలు జొన్నల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే.. జొన్నలను (Sorghum) పోషకాల గని అంటారు. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బీ పుష్కలంగా ఉన్నాయి. ఇవి గ్లూటెన్-రహిత ధాన్యం, బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి,చ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే.. జొన్నలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే.. వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా, ఉత్సాహంగా ఉంచడానికి జొన్న అంబలి ఒక అద్భుతమైన పానీయం. ఎండాకాలంలో టిఫిన్లు లేదా అన్నం తీసుకోవడం కష్టంగా అనిపించినప్పుడు, ఒక గ్లాసు జొన్న అంబలి తాగడం వల్ల కడుపు చల్లబడుతుంది.. ఇంకా కడుపు నిండుతుంది. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి చాలా మంచిది. జొన్న అంబలిని తయారు చేయడం చాలా సులభం.. జొన్న అంబలి 5 నిమిషాల్లో ఎలా చేయాలో తెలుసుకుందాం..
తయారీ విధానం:
ముందుగా, కొన్ని జొన్నలను పిండిలా కాకుండా, కొంచెం గరుకు గరుకుగా గ్రైండ్ చేసుకోవాలి. నాలుగు చెంచాల ఈ జొన్న పిండిని ఒక గిన్నెలో తీసుకొని, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని పోసి, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంపై మూత పెట్టి రాత్రంతా నానబెట్టాలి. రాత్రంతా నానబెట్టడం వల్ల అంబలికి ప్రత్యేకమైన రుచి వస్తుంది.
మరుసటి రోజు ఉదయం, నానబెట్టిన జొన్న పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి, అందులో ఒక గ్లాసున్నర నీళ్లు పోసి మంట ఎక్కువ పెట్టి బాగా మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత, నానబెట్టి కలుపుకున్న జొన్న పిండి మిశ్రమాన్ని ఈ కడాయిలో పోసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి.
స్టవ్ మంటను మామూలుగా తగ్గించి, జొన్న పిండిని నాలుగైదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఈ సమయంలో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే పిండి అడుగంటుతుంది. నాలుగైదు నిమిషాలు ఉడికిన తర్వాత, రుచికి సరిపడా ఉప్పు వేసి, మళ్ళీ మామూలు మంట మీద ఇంకో నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి. జొన్న పిండిని మరీ చిక్కగా అయ్యేదాకా ఉడికించకూడదు, ఎందుకంటే చల్లారిన తర్వాత అది మరింత గట్టిపడుతుంది. కాబట్టి కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆపి పక్కకు పెట్టుకోవాలి.
అంబలి కొద్దిగా చల్లారిన తర్వాత, ముందుగానే గడ్డలు లేకుండా చిలికిన పెరుగును అందులో వేసి బాగా కలుపుకోవాలి. రాత్రంతా నానబెట్టడం వల్ల అంబలి కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి, తియ్యటి పెరుగు వాడితే రుచి బాగుంటుంది. కలుపుకున్న జొన్న అంబలిని గ్లాసులలో పోసుకోవాలి. చివరగా, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తీసుకోవాలి.
ఈ జొన్న అంబలిని పొద్దున్నే తాగడం వల్ల కడుపు మంచి చల్లగా, నిండుగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి, వేసవిలో దీనిని తప్పకుండా ప్రయత్నించాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..