Reading Time: 2 minutes
Virat Kohli : అవుట్ ఇవ్వడం అన్యాయం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై  కోహ్లీ ఫైర్.. గ్రౌండ్‌లో హైడ్రామా

Virat Kohli : ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక క్యాచ్ పెను దుమారం రేపింది. ఆర్సీబీ ఆటగాడు రజత్ పాటిదార్ అవుట్ అయిన తీరుపై విరాట్ కోహ్లీతో పాటు యావత్ బెంగళూరు టీం యాజమాన్యం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. జేసన్ హోల్డర్ పట్టుకున్న క్యాచ్ క్లీన్ క్యాచ్ కాదని, బంతి నేలకు తగిలిందని ఆర్సీబీ వాదిస్తోంది. ఈ వివాదం ఇప్పుడు క్రికెట్ నిబంధనలపై కొత్త చర్చకు దారితీసింది.

అసలేం జరిగింది?

గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో రజత్ పాటిదార్ డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ వైపు భారీ షాట్ ఆడాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న జేసన్ హోల్డర్ డైవ్ చేస్తూ ఆ బంతిని అందుకున్నాడు. అయితే, స్లైడ్ అవుతున్న సమయంలో బంతి నేలకు తగిలినట్లు టీవీ రిప్లేలో స్పష్టంగా కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ చాలా వేగంగా దీనిని అవుట్ అని ప్రకటించారు. దీంతో విరాట్ కోహ్లీ మైదానంలోనే అంపైర్లతో వాదనకు దిగాడు. డగౌట్‌లో ఉన్న హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కూడా మ్యాచ్ అధికారుల వద్దకు వెళ్లి తన నిరసనను తెలియజేశారు.

క్రికెట్ రూల్స్ ఏం చెబుతున్నాయి?

ఈ వివాదంపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందిస్తూ ఎంసీసీ (MCC) క్రికెట్ నిబంధనలను ఉదహరించారు. నిబంధన 33.3 ప్రకారం.. “ఒక ఫీల్డర్ బంతిని పట్టుకున్న సమయం నుంచి, బంతిపై తన శరీరంపై పూర్తి నియంత్రణ సాధించే వరకు ఆ క్యాచ్ ప్రక్రియ కొనసాగుతుంది.” అంటే హోల్డర్ బంతిని అందుకున్నా, అతను స్లైడ్ అవుతున్న సమయంలో బంతి నేలకు తగిలితే అది అవుట్ కాకూడదు. ఎందుకంటే ఆ సమయంలో హోల్డర్‌కు తన కదలికలపై పూర్తి నియంత్రణ లేదు.

మాజీ క్రికెటర్ దొడ్డ గణేష్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. “ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి నిర్ణయాలు రావడం దారుణం. బంతి స్పష్టంగా గడ్డిని తాకింది. అంపైర్లు దీనిని ఎలా అవుట్ ఇచ్చారో అర్థం కావడం లేదు. ఇది ఆర్సీబీ జోరును పూర్తిగా దెబ్బతీసింది” అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఆకాష్ చోప్రా కూడా తన వీడియోలో మాట్లాడుతూ.. హోల్డర్ క్యాచ్ తీసుకునేటప్పుడు కంట్రోల్‌లో ఉన్నట్లు అనిపించినా, స్లైడ్ అయ్యేటప్పుడు బంతి నేలకు తగిలిందని, అది నాటౌట్ కావాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఆర్సీబీని దెబ్బతీసిన నిర్ణయం

మంచి ఊపులో ఉన్న రజత్ పాటిదార్ ఈ నిర్ణయం వల్ల పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆర్సీబీ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఈ వికెట్ పడటంతో మొమెంటం దెబ్బతిని, జట్టు ఇబ్బందుల్లో పడింది. నిబంధనల ప్రకారం ఫీల్డర్ క్యాచ్ పట్టిన తర్వాత బంతి నేలకు తగిలితే, ఆ ఫీల్డర్ అప్పటికే పూర్తి కంట్రోల్‌లో ఉంటేనే అది అవుట్ అవుతుంది. కానీ హోల్డర్ విషయంలో స్లైడింగ్ ఇంకా పూర్తి కాకముందే బంతి నేలకు తగిలినట్లు విజువల్స్ సూచిస్తున్నాయి. దీంతో ఆర్సీబీ అభిమానులు అంపైర్లపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..