
SA vs IND Women: భారత్ మహిళల జట్టుపై దక్షిణాఫ్రికా మహిళల జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 3-0తో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడో టీ20లో భారత్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ ను సొంతం చేసుకుంది. అంతకుముందు జరిగిన మొదటి రెండు మ్యాచ్ ల్లోనూ వరుసగా 6 వికెట్లు, 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా జట్టు, మూడు మ్యాచ్ ల్లోనూ ఛేజ్ చేస్తూ టీమిండియాపై ఆధిపత్యం కొనసాగించింది.
మూడో టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 20 ఓవర్లలో భారీ స్కోర్ నమోదు చేసింది. షెఫాలి వర్మ 64 పరుగులు, హర్మన్‌ప్రీత్ కౌర్ 66 పరుగులతో రాణించడంతో భారత్ 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఈ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా సులభంగా ఛేజ్ చేసింది. ఈ విజయానికి ప్రధాన కారకురాలు దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వుల్ఫార్ట్. ఛేజింగ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఆమె భారత బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ.. కేవలం 47 బంతుల్లోనే శతకం సాధించి తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసింది. మొత్తంగా 53 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లతో 115 పరుగులు చేసి జట్టుకు విజయం అందించింది.
లారా వుల్ఫార్ట్ ఈ సిరీస్‌లో వరుసగా 51, 54, 115 పరుగులు చేసి మొత్తం 220 పరుగులు సాధించింది. 73.33 సగటుతో సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో శతకం సాధించడం ద్వారా లారా వుల్ఫార్ట్ మరో అరుదైన ఘనతను కూడా సాధించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా 17 శతకాలు సాధించిన రికార్డును స్మృతి మంధాన, మెగ్ లానింగ్ తో సమం చేసింది. ఇప్పటివరకు ఆమె టెస్ట్‌లో 1, వన్డేల్లో 13, టీ20ల్లో 3 శతకాలు నమోదు చేసింది.