Reading Time: < 1 minute
Ap Govt Finalizes Local Cadre For Government Job Recruitment Issues New Orders

AP Government Job Recruitment: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పించేలా స్థానిక కేడర్ విధానాన్ని ఖరారు చేస్తూ సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది విడుదల చేసిన ఉత్తర్వులను పునఃసమీక్షించి తాజా మార్పులతో కొత్త మార్గదర్శకాలు అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్రాన్ని మొత్తం ఆరు జోన్లు మరియు మల్టీ జోన్లుగా విభజించారు. ఉద్యోగాల స్వభావం, వేతన స్థాయి ఆధారంగా పోస్టులను జిల్లా, జోన్, మల్టీ జోన్ స్థాయిలుగా వర్గీకరించారు. దీని ద్వారా నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా, వ్యవస్థీకృతంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Read Also: TFDA : తెలుగు చిత్రసీమలో సరికొత్త సంచలనం.. దర్శకుల కోసం చదలవాడ శ్రీనివాసరావు బంపర్ ఆఫర్

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మొత్తం పోస్టుల్లో 95 శాతం స్థానిక అభ్యర్థులకు కేటాయించనున్నారు. మిగిలిన 5 శాతం పోస్టులను ఇతర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు ఇవ్వనున్నారు. స్థానికులకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ విధానం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికతను నిర్ణయించేందుకు ప్రభుత్వం స్పష్టమైన ప్రమాణాలను నిర్ణయించింది. వరుసగా నాలుగేళ్లు ఒక ప్రాంతంలో నివాసం ఉండటం లేదా అక్కడే చదువుకోవడం ఆధారంగా అభ్యర్థి స్థానికతను ఖరారు చేయనున్నారు. దీంతో స్థానికతపై వివాదాలకు చెక్ పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

అయితే కొన్ని కీలక విభాగాలకు మినహాయింపులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం, హెచ్‌వోడీ (Head of Department) కార్యాలయాలు, రాష్ట్ర స్థాయి సంస్థలకు ఈ స్థానిక కేడర్ నిబంధనలు వర్తించవని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ విభాగాల్లో రాష్ట్రవ్యాప్తంగా మెరిట్ ఆధారంగా నియామకాలు కొనసాగనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ నిర్ణయం కీలకంగా మారనుంది. స్థానిక అభ్యర్థులకు అధిక అవకాశాలు కల్పించడంతో పాటు నియామకాలలో సమతుల్యత తీసుకురావడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.