Reading Time: < 1 minute
Rashid Khan Rejects India And Australia Citizenship Offers Stays Loyal To Afghanistan

Rashid Khan Citizenship Offer: ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒక్కడైన అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తన దేశంపై ఉన్న అపారమైన ప్రేమను మరోసారి చాటుకున్నాడు. తనకు భారత్, ఆస్ట్రేలియా దేశాల నుంచి పౌరసత్వం (సిటిజన్‌షిప్) ఇస్తామని ఆఫర్లు వచ్చినప్పటికీ.. తాను మాత్రం కేవలం అఫ్గానిస్థాన్ తరఫునే అంతర్జాతీయ క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు. భారత్, ఆస్ట్రేలియా దేశాల నుంచి పౌరసత్వంను సున్నితంగా తిరస్కరించానని రషీద్ వెల్లడించాడు.

‘2023 ఐపీఎల్ సమయంలో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నప్పుడు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)కి చెందిన ఒక ఉన్నతాధికారిని కలిశా. ఆయన ఆహ్వానం మేరకు వెళ్లి ప్రత్యేకంగా కలిశాను. ఆ అధికారి భారత్‌లో స్థిరపడమని సలహా ఇచ్చారు. అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులు బాగాలేవు కాబట్టి భారత్‌కు వచ్చేయాలని చెప్పారు. ఇక్కడ ఉండటానికి కావాల్సిన అన్ని డాక్యుమెంట్లు సమకూరుస్తామని, ఇక్కడే ఉంటూ క్రికెట్ ఆడవచ్చని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదన విని మొదట ఆశ్చర్యపోయాను. అయితే ఎంతో పరిణతితో, నవ్వుతూనే ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించా’ అని రషీద్ ఖాన్ చెప్పాడు.

Also Read: Shreyas Iyer-PBKS Wis: మా విజయ రహస్యం అదే.. అసలు విషయం చెప్పేసిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్‌!

‘మీ మద్దతుకు ధన్యవాదాలు. కానీ నేను నా దేశం అఫ్గానిస్థాన్ తరఫునే క్రికెట్ ఆడాలనుకుంటున్నాను. నా దేశం తరఫున ఆడలేనప్పుడు, మరే ఇతర దేశం కోసం కూడా ఆడను అని చెప్పానని’ అని రషీద్ ఖాన్ వెల్లడించాడు. ఆస్ట్రేలియా ఆఫర్‌ను కూడా ఇలానే తిరస్కరించానని రషీద్ చెప్పాడు. ఈ ఘటనతో తన దేశం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, దేశభక్తి మరోసారి ప్రపంచానికి తెలిసింది. రషీద్ అఫ్గానిస్థాన్ తరఫున 6 టెస్టులు, 117 వన్డేలు, 115 టీ20లు ఆడాడు.