Reading Time: 2 minutes
Indigo Flight Fare Hike Tickets Costlier From Today Check New Fuel Surcharge On Major Routes

IndiGo Flight Fare Hike: విమాన ప్రయాణికులకు ఇండిగో షాక్‌ ఇచ్చింది. అక్టోబర్ 6, 2026 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఫ్యూయల్ సర్‌చార్జ్‌ను పెంచింది. పెరుగుతున్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌లైన్ వెల్లడించింది. దీంతో ఇండిగోలో ప్రయాణించే వారికి టికెట్‌ బుకింగ్‌ సమయంలో గతంతో పోలిస్తే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

కిలోమీటర్ల ఆధారంగా ఫ్యూయల్ సర్‌చార్జ్‌

ఇండిగో కొత్త ఫ్యూయల్ సర్‌చార్జ్‌ అక్టోబర్ 6న రాత్రి 12:01 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. దేశీయ విమానాల్లో ప్రయాణించే దూరాన్ని బట్టి సర్‌చార్జ్‌ను నిర్ణయించారు. దూరాన్ని బట్టి ఒక్కో ప్రయాణికుడిపై రూ.100 నుంచి రూ.350 వరకు అదనపు భారం పడనుంది. 500 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి ఫ్యూయల్ సర్‌చార్జ్ రూ.375గా ఉంటుంది. 501 నుంచి 1,000 కిలోమీటర్ల దూరానికి రూ.600, 1,001 నుంచి 1,500 కిలోమీటర్ల వరకు రూ.900, 1,501 నుంచి 2,000 కిలోమీటర్ల వరకు రూ.1,150, 2,000 కిలోమీటర్లకు పైబడిన ప్రయాణాలకు రూ.1,300 ఫ్యూయల్ సర్‌చార్జ్‌ చెల్లించాల్సి ఉంటుంది.

ఢిల్లీ-ముంబై నుంచి బెంగళూరు-చెన్నై వరకు.. ఏ రూట్‌పై ఎంత?

ప్రధాన నగరాల మధ్య ఇండిగో విమాన ప్రయాణాలకు వర్తించే కొత్త ఫ్యూయల్ సర్‌చార్జ్‌ దూరాన్ని బట్టి మారుతుంది. ఢిల్లీ-ముంబై మార్గంలో సుమారు 1,140 కిలోమీటర్ల దూరానికి ఒక్కో ప్రయాణికుడిపై రూ.900 సర్‌చార్జ్‌ ఉంటుంది. గతంతో పోలిస్తే ఇది రూ.300 పెరిగింది.

ఢిల్లీ-బెంగళూరు సుమారు 1,740 కిలోమీటర్లు కావడంతో రూ.1,150 సర్‌చార్జ్‌ చెల్లించాలి. ఈ రూట్‌లో పెంపు రూ.350. ఢిల్లీ-చెన్నై మార్గంలో కూడా సుమారు 1,760 కిలోమీటర్ల దూరానికి రూ.1,150, అంటే రూ.350 పెంపు వర్తిస్తుంది. ఢిల్లీ-హైదరాబాద్, ఢిల్లీ-కోల్‌కతా మార్గాల్లో ఒక్కో ప్రయాణికుడిపై రూ.900 సర్‌చార్జ్‌ ఉంటుంది. ఈ రెండు రూట్లలో పెంపు రూ.300.

మరోవైపు ముంబై-బెంగళూరు మార్గంలో కొత్త ఫ్యూయల్ సర్‌చార్జ్‌ రూ.600, పెంపు రూ.200. ముంబై-చెన్నైకి రూ.900, ముంబై-హైదరాబాద్కు రూ.600, ముంబై-కోల్‌కతాకు రూ.1,150 చెల్లించాల్సి ఉంటుంది.

బెంగళూరు-చెన్నై మార్గం సుమారు 290 కిలోమీటర్లు కావడంతో సర్‌చార్జ్‌ రూ.375గా ఉంటుంది. బెంగళూరు-హైదరాబాద్ మార్గానికి కూడా రూ.375 వర్తిస్తుంది. బెంగళూరు-కోల్‌కతా ప్రయాణానికి రూ.1,150 ఫ్యూయల్ సర్‌చార్జ్‌ ఉంటుంది.

అలాగే చెన్నై-కోల్‌కతా మార్గంలో రూ.900, హైదరాబాద్-కోల్‌కతా మార్గంలో రూ.900 ఫ్యూయల్ సర్‌చార్జ్‌ చెల్లించాల్సి ఉంటుంది.

టికెట్‌ ధర ఎంత పెరుగుతుంది?

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. పెరిగిన ఫ్యూయల్ సర్‌చార్జ్‌ మొత్తం టికెట్ ధరకు అదనంగా చేరుతుంది. అయితే ప్రయాణికుడు చెల్లించే ఫైనల్ టికెట్ ధర కేవలం ఫ్యూయల్ సర్‌చార్జ్‌పై మాత్రమే ఆధారపడదు. ప్రయాణ తేదీ, సీట్ల లభ్యత, బేస్ ఫేర్, పన్నులు, ఇతర ఛార్జీలను బట్టి టికెట్‌ మొత్తం ధర మారవచ్చు. అందువల్ల ఇండిగోలో విమాన టికెట్‌ బుక్‌ చేసుకునే ముందు కేవలం బేస్ ఫేర్‌ను మాత్రమే కాకుండా ఫ్యూయల్ సర్‌చార్జ్‌, పన్నులు, ఇతర ఛార్జీలు కలిపిన తుది ధరను పరిశీలించడం మంచిది.

అంతర్జాతీయ విమానాలపైనా ప్రభావం

దేశీయ విమానాలతో పాటు ఇండిగో అంతర్జాతీయ విమానాల ఫ్యూయల్ సర్‌చార్జ్‌ను కూడా పెంచింది. అంతర్జాతీయ రూట్లకు వర్తించే కొత్త ఛార్జీలు కూడా పెరుగుతున్న ATF ధరల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని సవరించినట్లు ఎయిర్‌లైన్ తెలిపింది.