Reading Time: 2 minutes
Cabinet Approves Rs 10000 Crore Sme Growth Fund Itla

కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 10,000 కోట్ల SME వృద్ధి నిధికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన మంగళవారం కేబినెట్ సమావేశం అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.

దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (SMEs) మరింత ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా రవాణా, లాజిస్టిక్స్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా సమన్వయం చేసేందుకు ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ (ITLA) ఏర్పాటుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ ద్వారా చిన్న, మధ్య తరహా సంస్థల్లో నేరుగా ఈక్విటీ పెట్టుబడులు పెట్టనున్నారు. ముఖ్యంగా ఇప్పటికే వ్యాపార సామర్థ్యాన్ని నిరూపించుకున్న, భవిష్యత్తులో వేగంగా విస్తరించే అవకాశమున్న సంస్థలకు దీర్ఘకాలిక గ్రోత్ ఈక్విటీ క్యాపిటల్ అందించడం ఈ ఫండ్ ప్రధాన ఉద్దేశం. ఎస్ఎంఈల వృద్ధి దశలో ఎదురవుతున్న మూలధన కొరతను అధిగమించేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. మొత్తం రూ.10,000 కోట్లను ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ కింద ఏర్పాటు చేసే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌కు కేంద్ర ప్రభుత్వం అందించనుంది.

ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్‌లో ఎక్కువ భాగం నిధులను చిన్న, మధ్య తరహా తయారీ రంగ సంస్థలకు కేటాయించనున్నట్లు కేంద్రం తెలిపింది. అలాగే టైర్-2, టైర్-3 నగరాల్లోని పారిశ్రామిక క్లస్టర్లలో పనిచేస్తున్న ఎస్ఎంఈలను కూడా ఈ ఫండ్ పరిగణనలోకి తీసుకోనుంది. ఈ నిధులతో సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు కొత్త టెక్నాలజీని స్వీకరించడం, తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశించడం, గ్లోబల్ వాల్యూ చెయిన్లలో భాగస్వాములు కావడం, వ్యూహాత్మక పెట్టుబడులు చేపట్టడం వంటి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది.

ప్రస్తుతం ఉన్న అనేక ఫండ్లు ఈక్విటీ సపోర్ట్ అందిస్తున్నప్పటికీ.. వాటిలో ఎక్కువ భాగం ప్రారంభ దశలో ఉన్న సంస్థలు, ముఖ్యంగా మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌పై దృష్టి పెడుతున్నాయని కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో చిన్న, మధ్య తరహా సంస్థల వృద్ధి దశలో అవసరమయ్యే ఈక్విటీ మూలధనంలో ఉన్న నిర్మాణాత్మక లోటును భర్తీ చేయడమే ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ లక్ష్యమని ప్రభుత్వం వివరించింది.

రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో సమగ్ర ప్రణాళిక, పరిశోధన, ప్రాజెక్టుల అంచనా, పర్యవేక్షణ, విధానపరమైన సహకారం కోసం ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ (ITLA)ను స్పెషల్ పర్పస్ వెహికల్‌గా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ITLA దేశంలో రవాణా, లాజిస్టిక్స్ ప్రణాళిక, పరిశోధన, ప్రాజెక్టుల సాంకేతిక అంచనా, పర్యవేక్షణ, పాలసీ సపోర్ట్, డేటా అనలిటిక్స్‌కు అత్యున్నత సమన్వయ సంస్థగా పనిచేయనుంది.

దేశంలోని రవాణా మౌలిక వసతుల అభివృద్ధి కోసం ITLA సమగ్ర నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ మాస్టర్ ప్లాన్ రూపొందించనుంది. ఈ ప్రణాళికకు కనీసం 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక రూపొందిస్తారు. ఈ మాస్టర్ ప్లాన్‌లో రోడ్లు, రైల్వేలు, పోర్టులు, షిప్పింగ్, పౌర విమానయానం, అంతర్గత జలరవాణా, తీర ప్రాంత షిప్పింగ్, పట్టణ రవాణా, లాజిస్టిక్స్ వంటి రంగాలు ఉంటాయి. రవాణా మంత్రిత్వ శాఖలు రూపొందించే స్వల్పకాలిక, వార్షిక ప్రణాళికలను కూడా ITLA పరిశీలించనుంది. అవి నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ఉన్నాయా? మల్టీమోడల్ మౌలిక వసతుల అభివృద్ధికి దోహదపడుతున్నాయా? అనే అంశాలను అంచనా వేయనుంది. అలాగే రూ.500 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వ్యయంతో చేపట్టే కేంద్ర ప్రభుత్వ మౌలిక వసతుల ప్రాజెక్టులకు సాంకేతిక అంచనా ITLA నిర్వహించనుంది. అయితే ఆ ప్రాజెక్టుల ఆర్థిక అంచనా మాత్రం ప్రస్తుతం ఉన్న విధానాల ప్రకారమే కొనసాగుతుంది. ప్రాజెక్టుల అమలును పర్యవేక్షించడంతో పాటు.. అవి పూర్తయిన తర్వాత వాటి ప్రభావాన్ని కూడా ITLA అంచనా వేయనుంది.

రవాణా రంగానికి సంబంధించిన వివిధ డేటాను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడానికి నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ డేటా రిపాజిటరీని కూడా ITLA ఏర్పాటు చేయనుంది. GSTN ఈ-వే బిల్లులు, FASTag, Vahan, GPS ఆధారిత వ్యవస్థలు, పట్టణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ వంటి వివిధ వనరుల నుంచి డేటాను సేకరించి ఈ రిపాజిటరీలో సమీకరించనున్నారు. ITLA ఏర్పాటుతో రోడ్డు, రైలు, పోర్టులు, విమానయానం, జలరవాణా వంటి వివిధ రవాణా మార్గాల మధ్య మెరుగైన సమన్వయం సాధించవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మల్టీమోడల్ కనెక్టివిటీ బలోపేతం, మౌలిక వసతుల సామర్థ్యం పెంపు, లాజిస్టిక్స్ ఖర్చుల తగ్గింపు, అంతర్జాతీయ లాజిస్టిక్స్ రంగంలో భారత్ పోటీతత్వం పెంపు వంటి ప్రయోజనాలు కలుగుతాయని ప్రభుత్వం తెలిపింది.