Reading Time: < 1 minute

హర్మన్‎ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం.. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్ బై

Caption of Image.

న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి ఆమె గుడ్ బై చెప్పారు. మంగళవారం (అక్టోబర్ 6) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ నిర్ణయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించారు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ సాధారణ క్రీడాకారురాలిగా జట్టులో కొనసాగనున్నట్లు హర్మన్ స్పష్టం చేశారు.

‘‘భారత మహిళల క్రికెట్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఈ రోజుతో నేను తప్పుకుంటున్నాను. ఇది నాకు అంత సులువైన నిర్ణయం కాదు. దీని వెనుక ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు, భావోద్వేగాలు, త్యాగాలు దాగి ఉన్నాయి. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ తాను ఒక సాధారణ ప్లేయర్‎గా భారత జట్టు తరఫున కొనసాగుతా. నాయకత్వం ముగిసింది. కానీ నా ప్రయాణం కొనసాగుతుంది’’ ఈ సందర్భంగా హర్మన్ పేర్కొన్నారు. 

ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో హర్మన్‎ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత మహిళా జట్టు స్వర్ణ పతకం గెలిచిన విషయం తెలిసిందే. భారత్‏కు గోల్డ్ మెడల్ అందించిన రోజుల వ్యవధిలోనే ఆమె ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

భారత ఉమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్‎గా స్మృతి..!

అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి హర్మన్‎ప్రీత్ గుడ్ బై చెప్పడంతో నెక్ట్స్ సారథి ఎవరనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో భారత మహిళా క్రికెట్ జట్టు ప్రస్తుత వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ స్మృతి మందనాకు బీసీసీఐ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. హర్మన్ నేతృత్వంలో టీమిండియా 2025 వన్డే వరల్డ్ కప్‎తో పాటు 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన విషయం తెలిసిందే. 

©️ VIL Media Pvt Ltd.