
Infinix Smart 20 HD: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఇన్ఫినిక్స్ మరో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ ఏడాది జూన్‌లో విడుదలైన Smart 20 సిరీస్‌లో తాజాగా Infinix Smart 20 HD చేరింది. 8.25mm స్లిమ్ బాడీ, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, Unisoc ప్రాసెసర్, 5,000mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇంటర్నెట్ లేకుండానే కమ్యూనికేషన్ చేసుకునే “అల్ట్రా లింక్” ఫీచర్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
భారత్‌లో Infinix Smart 20 HDని 3GB RAM + 64GB స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో విడుదల చేశారు. అన్ని ఆఫర్లను కలుపుకుని ఈ వేరియంట్ ధర రూ.10,999గా కంపెనీ ప్రకటించింది. అయితే ఫ్లిప్కార్ట్ లో ఇదే వేరియంట్ రూ.18,499 ధరతో లిస్ట్ అయింది. ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కూడా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. కొనుగోలుదారులకు ఆరు నెలల నో-కాస్ట్ EMI సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను సన్ లైక్ ఆరంజ్, సిల్వర్ డాన్సర్, నైట్ పల్స్ అనే మూడు కలర్ ఆప్షన్లలో తీసుకొచ్చారు.
ఈ Infinix స్మార్ట్ 20 HDలో 6.67 అంగుళాల HD+ పంచ్-హోల్ డిస్‌ప్లేను అందించారు. ఇది 720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ 700 నిట్స్ HBM బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. దీంతో వీడియోలు చూడటం, సోషల్ మీడియా బ్రౌజింగ్, రోజువారీ వినియోగంలో స్క్రీన్ అనుభవం మెరుగ్గా ఉండనుంది. పనితీరు కోసం ఫోన్‌లో Unisoc T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి 3GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ జత చేశారు. అదనంగా వర్చువల్ RAMను 6GB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. స్టోరేజ్‌ను మరింత పెంచుకునేందుకు ప్రత్యేక మైక్రోSD కార్డ్ స్లాట్ కూడా అందించారు. సాఫ్ట్‌వేర్ పరంగా ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15.1పై ఫోన్ పనిచేస్తుంది.
కెమెరాల విషయానికి వస్తే.. వెనుక భాగంలో 8MP కెమెరాను అందించారు. ఇందులో ఆటోఫోకస్ సపోర్ట్ ఉంది. Super Night, Dual Video, Vlog, Documents, Pro, Panorama, Time-Lapse వంటి పలు కెమెరా మోడ్‌లు ఉన్నాయి. ఈ కెమెరాతో 30fps వద్ద 2K రిజల్యూషన్ వరకు వీడియోలను రికార్డ్ చేయవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP కెమెరాను అందించారు. ఇక ఆడియో పరంగా.. డ్యూయల్ స్పీకర్లను అందించారు. అల్ట్రా వాల్యూం మోడ్ ద్వారా సాధారణ స్థాయి కంటే 300 శాతం వరకు అధిక వాల్యూమ్‌ను పొందవచ్చని కంపెనీ చెబుతోంది. DTS ఆడియో సపోర్ట్ కూడా ఉంది. కాల్స్‌లో స్పష్టమైన వాయిస్ కోసం Pure Voice టెక్నాలజీతో పాటు మూడు నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్‌లను అందించారు. వీటిలో Smart NC, Standard NC వంటి ఆప్షన్లు ఉన్నాయి.
ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా అందించిన Ultra Link ఫీచర్ ఆసక్తికరంగా ఉంది. బ్లూటూత్ ఆధారిత కనెక్టివిటీ ద్వారా మొబైల్ నెట్‌వర్క్ లేదా ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినా సమీపంలోని అనుకూల పరికరాలతో కమ్యూనికేట్ చేయవచ్చు. 200 మీటర్ల దూరం వరకు ఆఫ్‌లైన్ కాల్స్, మెసేజ్‌లు, వాయిస్ నోట్స్, ఫొటోలను షేర్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ మొబైల్లో 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది 15W వరకు ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అయితే బాక్స్‌లో 10W ఛార్జింగ్ అడాప్టర్‌ను అందిస్తున్నారు. ఫోన్ కొలతలు 165.62×77.01×8.25mm కాగా, బరువు 189 గ్రాములు. దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్‌ను అందించారు.
ఫోన్ దీర్ఘకాలిక పనితీరుకు సంబంధించి కంపెనీ మరో ప్రత్యేకతను వెల్లడించింది. సంస్థ అంతర్గత పరీక్షల ఆధారంగా స్మార్ట్ 20 HDకు 48 నెలల TÜV ఫ్లుయెన్సీ సర్టిఫికేషన్ లభించిందని తెలిపింది. దీర్ఘకాలం ఉపయోగించినా ఫోన్ స్మూత్‌గా పనిచేసేలా రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. అలాగే చేతులకు నూనె లేదా జిడ్డు ఉన్నప్పటికీ టచ్ ఇన్‌పుట్‌కు ఫోన్ స్పందించేలా రూపొందించినట్లు వెల్లడించింది.