
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతి రాజధానికి తూర్పు భారతదేశంతో మరో భారీ రహదారి అనుసంధానం రాబోతోంది. ఏపీ వాటాగా సుమారు రూ.32 వేల కోట్ల అంచనా వ్యయంగా ఈ ప్రాజెక్టును చెబుతున్నారు.. ఖరగ్‌పూర్ –అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవేగా ఈ నిర్మాణం రూపుదిద్దుకోబోతోంది.. ప్రాజెక్టులో మొత్తం పొడవు 1,107 కిలో మీటర్లు. కాగా ఒక్క ఏపీ లోనే 457 కిలోమీటర్లు రహదారి నిర్మాణం కానుంది… అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవేగా చెప్పుకునే ఈ ప్రాజెక్టు , పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది.
ఏపీ పరిధిలో సుమారు 457 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం జరగనుంది.. ఏపీ భాగానికి సుమారు రూ.32 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. మొత్తం నాలుగు రాష్ట్రాల ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.75,629 కోట్లుగా చెబుతున్నారు.. ఏపీ పరిధిలో 457 కిలోమీటర్ల ఎలైన్‌మెంట్‌కు కూడా కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపింది.. కురుపాం, సాలూరు, అరకు, పాడేరు, చింతపల్లి, జంగారెడ్డిగూడెం, నూజివీడు తదితర ప్రాంతాల మీదుగా అమరావతి వరకు ఈ కారిడార్ సాగనుంది. ఆగిరిపల్లి సమీపంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుతో ఈ హైవే అనుసంధానం కానుంది. ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే సుమారు 200 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టులో, కొత్త రహదారి నిర్మాణం జరిగే అవకాశం ఉంది.. అరకు, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు ప్రాంతాలు కూడా ఈ కారిడార్ పరిధిలోకి వస్తాయి.
కొండలు, అటవీ, గిరిజన ప్రాంతాల మీదుగా రహదారి వెళ్లనున్న నేపథ్యంలో భూసేకరణతో పాటు అటవీ, పర్యావరణ అనుమతులు కీలకం కానున్నాయి. మొత్తం ప్రాజెక్టుకు సుమారు 10,630 హెక్టార్ల భూమి అవసరమవుతుందని, అందులో 2,371 హెక్టార్లు అటవీ భూమిగా పేర్కొంటున్నారు. అయితే, ఏపీలో గ్రామాల వారీగా ఎంత భూమి సేకరిస్తారు, ఎన్ని కుటుంబాలు ప్రభావితమవుతాయన్నది తుది భూసేకరణ ప్రక్రియలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హైవే పూర్తయితే అమరావతికి తూర్పు భారతదేశం నుంచి వేగవంతమైన రహదారి కనెక్టివిటీ ఏర్పడనుందని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక సరుకుల రవాణా వేగవంతం కావడంతో రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉందనీ అంటున్నారు..
మరోవైపు గిరిజన ప్రాంతాలకు మార్కెట్లు, వైద్యం, విద్య, ఉపాధి అవకాశాలకు మెరుగైన రవాణా సౌకర్యం అందే అవకాశం ఉంది. అయితే రూ.32 వేల కోట్ల ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎలైన్‌మెంట్ ఆమోదం తర్వాత ఇక భూసేకరణ, పూర్తి స్థాయి డీపీఆర్, తుది అనుమతులు, టెండర్ల ప్రక్రియపైనే ప్రాజెక్టు వేగం ఆధారపడి ఉంది.. ఆగస్టులో 457 కిలోమీటర్ల ఏపీ అలైన్‌మెంట్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇప్పుడు సంబంధిత జిల్లాల్లో భూసేకరణ ప్రక్రియ కూడా మొదలైనట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రాజెక్టు కాగితాలపై నుంచి భూమిపైకి ఎప్పుడు వస్తుంది అన్న ఆసక్తి స్థానికుల్లో ఉంది.. ఈ ప్రాజెక్టులో రైతులకు ఎంత మేరా పరిహారం అందుతుంది? అటవీ భూమికి ఎలాంటి అనుమతులు కావాలి? నిర్మాణ పనులకు టెండర్లు ఎప్పుడు పూర్తవుతాయి? ఇవే ఇప్పుడు కీలక ప్రశ్నలుగా ఉన్నాయి..