Reading Time: < 1 minute

టీమిండియా సెలెక్షన్‌లో కొత్త ట్విస్ట్.. ప్రతి మీటింగ్‌కు VVS లక్ష్మణ్.. ఎందుకీ నిర్ణయం తీసుకున్నట్లు

Caption of Image.

Team India: భారత పురుషుల క్రికెట్ జట్టు ఎంపిక విషయంలో బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) హెడ్, టీమిండియా మాజీ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) ఇకపై జాతీయ సెలక్షన్ కమిటీ సమావేశాలన్నింటికీ క్రమం తప్పకుండా హాజరవుతారని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఆటగాళ్ల ఫిట్‌నెస్, గాయాలపై ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సమాచార లోపాన్ని నివారించేందుకే ఈ నిర్ణయం: 

గౌహతిలోని ఏసీఏ స్టేడియంలో న్యూజిలాండ్ టూర్ టీ20, ఇండియా ‘ఏ’ జట్ల ఎంపిక కోసం జరిగిన సెలక్షన్ కమిటీ మీటింగ్ లో వీవీఎస్ లక్ష్మణ్ ప్రత్యేకంగా పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. గత నెల ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమగ్ర సమీక్ష సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆటగాళ్ల గాయాలు, ఫిట్‌నెస్ స్థితిగతులపై పూర్తి సమాచారం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) వద్ద ఉంటుంది, సెలెక్టర్లకు, CoEకి మధ్య ఎలాంటి పొరపాట్లు (miscommunication) జరగకుండా ఉండేందుకే లక్ష్మణ్ ఇకపై అన్ని సెలక్షన్ మీటింగ్స్‌కు హాజరవుతారని సైకియా స్పష్టం చేశారు.

ఫిట్‌నెస్ సమస్యల పరిష్కారమే లక్ష్యం: 

గత కొంతకాలంగా పురుషుల జట్టు ఎంపిక సమయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. కొందరి ఆటగాళ్ల పేర్లను స్క్వాడ్‌లో ప్రకటించిన తర్వాత, వారు సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతో చివరి నిమిషంలో టూర్ల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సమస్యను శాశ్వతంగా నివారించడమే ఈ కొత్త విధానం ముఖ్య ఉద్దేశమని దేవజిత్ సైకియా తెలిపారు. ఇది కేవలం పారదర్శకత గురించిన అంశం కాదని, సెలెక్టర్లకు కచ్చితమైన ఫిట్‌నెస్ డేటాను అందించడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడుతుందని వెల్లడించారు. 

©️ VIL Media Pvt Ltd.