Reading Time: < 1 minute
తొలి టీ20కు ముందే టీమిండియాకు డేంజర్ బెల్.. విండీస్ టీంలోకి విధ్వంసకర ప్లేయర్ ఎంట్రీ..!

India vs West Indies T20 series: టీం ఇండియాతో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అమీర్ జంగూను టీ20 జట్టులోకి తీసుకుంది. చండీగడ్ వన్డేలో గాయపడిన యువ బ్యాటర్ జువెల్ ఆండ్రూకు బ్యాకప్‌గా జంగూను ఎంపిక చేశారు. మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా జువెల్ ఆండ్రూ చేతి వేలికి తీవ్రంగా గాయమైంది. గాయం తీవ్రత దృష్ట్యా, అతడు టీ20 సిరీస్ నుంచి తప్పుకునే అవకాశం ఉండటంతో జంగూకు ఈ అవకాశం దక్కింది.

టీం ఇండియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో జంగూ అద్భుతంగా రాణించాడు. ఆడిన మూడు ఇన్నింగ్స్‌లలోనూ 119.50 సగటుతో, 135.80 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 239 పరుగులు సాధించాడు. తొలి వన్డేలో మెరుపు హాఫ్ సెంచరీ, రెండో వన్డేలో అద్భుత సెంచరీ, చివరి వన్డేలో అర్ధ శతకంతో మెరిశాడు. ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న జంగూ టీ20 జట్టులోకి రావడంతో మరోసారి భారత బౌలర్లకు కఠిన సవాల్ ఎదురుకానుంది.

2025 సెప్టెంబర్ 27న నేపాల్‌పై అరంగేట్రం చేసిన జంగూ, ఇప్పటివరకు వెస్టిండీస్ తరఫున ఏడు టీ20లు ఆడి 163 పరుగులు చేశాడు. మొత్తంగా 34 టి20 మ్యాచ్‌లలో 710 పరుగులు సాధించాడు. ఇటీవల కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో యాంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ రేపు లక్నో వేదికగా జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..