Reading Time: 2 minutes

ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమానికి వెళ్లేందుకు కోహ్లీకి రూ.5 కోట్లు?.. అసలు నిజం ఇదే!

Caption of Image.

Virat Kohli : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ (Premanand Maharaj) ఆశ్రమ సందర్శనకు సంబంధించి వస్తున్న వార్తలపై కోహ్లీ టీమ్ స్పందించింది. కోహ్లీ ఆశ్రమాన్ని సందర్శించడానికి రాజస్థాన్‌కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ భారీగా డబ్బులు చెల్లించిందంటూ వస్తున్న పుకార్లని పూర్తిగా తోసిపుచ్చింది. ఆ వార్తలు పూర్తిగా నిరాధారమైనవి అని తేల్చి చెప్పారు. 

ఫలహారీ మహారాజ్ ఆరోపణలని ఖండించిన కోహ్లీ టీమ్: 

శ్రీ కృష్ణ జన్మభూమి సంఘర్ష్ న్యాస్ అధ్యక్షుడు దినేష్ శర్మ (ఫలహారీ మహారాజ్) ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు రాసిన ఒక లేఖలో.. విరాట్ కోహ్లీని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమానికి తీసుకెళ్లడానికి ఒక రాజస్థాన్ ప్రైవేట్ కంపెనీ రూ. 5 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఈ వార్తలపై విరాట్ కోహ్లీ అధికారిక ప్రతినిధి తీవ్రంగా స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. 

అధికారిక ప్రకటన: విరాట్ కోహ్లీకి సంబంధించి వస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధం, నిరాధారమైనవి అని పేర్కొన్నాడు. కోహ్లీ కేవలం మహారాజ్ పై ఉన్న గాఢమైన భక్తి, శ్రద్ధల కారణంగానే ఆశ్రమాన్ని సందర్శిస్తున్నారు. ఈ తరహా నిరాధార వార్తలను ప్రసారం చేసే ముందు మీడియా సంస్థలు తగిన పరిశీలన చేసి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. 

విరాట్ – అనుష్కల బృందావన యాత్రలు: 

విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్క శర్మ తమ కుమార్తె వమికాతో కలిసి తొలిసారిగా 2023 జనవరిలో బృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆ తర్వాత 2025లో, అలాగే మే నెలలో టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా వారు మహారాజ్ ని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

ప్రేమానంద్ మహారాజ్ ఆధ్యాత్మిక సందేశాలు: 

విరాట్ కోహ్లీ దంపతులతో సమావేశమైన సందర్భంగా ప్రేమానంద్ మహారాజ్ జీవిత పరమార్థాన్ని వివరిస్తూ పలు అమూల్యమైన సూచనలు చేశారు. మీరు చేసే పనులను సేవగా భావించండి, వినయంగా ఉండండి, భగవన్నామ స్మరణ చేయండి. మన అంతర్గత ఆలోచనలు మారాలి.. కీర్తి ప్రతిష్టల ఆశను వదిలిపెట్టి, లౌకిక జీవితంలో ఉంటూనే మనసును భగవంతుడి వైపు మళ్లించాలని ప్రేమానంద్ మహారాజ్ వారికి మార్గనిర్దేశం చేశారని వెల్లడించారు. 

 

©️ VIL Media Pvt Ltd.