Reading Time: 2 minutes
అప్పుడు భయపెట్టాడు.. ఇప్పుడు నవ్విస్తున్నాడు..! ఈ నటుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.?

కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైనప్పుడు పెద్దగా ప్రభావం చూపించకపోయినా.. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం అనూహ్యంగా వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు మలయాళ సినిమా ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’ పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. థియేటర్లలో ఓ మోస్తరు స్పందన అందుకున్న ఈ చిత్రం.. ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా సినిమాలోని నటీనటుల గురించి నెటిజన్లు ఆసక్తిగా ఆరా తీస్తున్నారు. హీరోయిన్ మమితా బైజు ఎప్పటిలాగే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. సినిమాలోని ఇతర పాత్రల గురించి కూడా ఆసక్తికర విషయాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ సినిమాలో బైజు అనే పాత్రలో కనిపిస్తూ ప్రేక్షకులను నవ్వించిన నటుడు సురేశ్ కృష్ణ. ఈ పేరు చాలామందికి కొత్తగా అనిపించవచ్చు. కానీ తెలుగు ప్రేక్షకుల్లో కొందరికి మాత్రం ఈ నటుడి ముఖం చూసిన వెంటనే ఓ పాత సినిమా గుర్తొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సుమారు 26 ఏళ్ల క్రితం వచ్చిన ఓ తెలుగు డబ్బింగ్ సినిమాలో ఇదే నటుడు భయంకరమైన విలన్ పాత్రలో కనిపించాడు. అప్పట్లో తన లుక్, నటనతో ప్రేక్షకులను భయపెట్టిన సురేశ్ కృష్ణ.. ఇప్పుడు ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’లో మాత్రం పూర్తి భిన్నమైన అవతారంలో కనిపించి నవ్వులు పూయిస్తున్నాడు.

2000లో విడుదలైన ‘దుర్గా’ సినిమాలో సురేశ్ కృష్ణ ప్రతినాయకుడి పాత్రలో కనిపించాడు. తమిళంలో ‘పొట్టు అమ్మన్’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో రోజా ప్రధాన పాత్ర పోషించారు. తెలుగులో డబ్ అయిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలో సురేశ్ కృష్ణ కనిపించిన తీరు, అతడి విలనిజం అప్పట్లో ప్రేక్షకులను భయపెట్టింది. అయితే ఇప్పుడు అదే నటుడిని ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’లో సరదాగా, కామెడీ పండించే పాత్రలో చూసి తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

ఈ విషయాన్ని సురేశ్ కృష్ణ కూడా స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. 2000లో తాను చేసిన పాత్రకు సంబంధించిన ఫొటోతో పాటు.. ప్రస్తుతం ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’లో తాను కనిపిస్తున్న లుక్‌ను షేర్ చేస్తూ.. రెండు పాత్రల్లోనూ నటించింది తానేనని తెలియజేశాడు. దీంతో ఈ విషయం నెట్టింట మరింత వైరల్‌గా మారింది. సురేశ్ కృష్ణ 1993 నుంచి సినీ రంగంలో కొనసాగుతున్నాడు. ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసిన ఆయన.. క్రమంగా సహాయ నటుడిగా, ప్రతినాయకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. దుర్గా తర్వాత ఆయనకు వరుసగా అవకాశాలు రావడం మొదలైంది. వివిధ రకాల పాత్రలు చేస్తూ మలయాళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలోనూ పనిచేశాడు. ఇన్నేళ్లుగా మలయాళ సినిమాలు, టెలివిజన్‌లో తనదైన శైలిలో నటిస్తున్న సురేశ్ కృష్ణ.. ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు.

 

View this post on Instagram

 

A post shared by Suresh Krishna (@actor_sureshkrishna)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.