
Sidharth – Kiara: బాలీవుడ్ లవ్లీ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్ర, కియారా అడ్వాణీ తమ అభిమానులకు గుడ్ న్యూ్స్ చెప్పారు. గతేడాది పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఈ జంట, ఇప్పుడు రెండో సంతానాన్ని ఆహ్వానించేందుకు సిద్ధమవుతోంది. ఏడాది తిరిగేలోపే మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నామన్న విషయాన్ని స్వయంగా వెల్లడించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. “మా మనసులు ఆనందంతో, ప్రేమతో నిండిపోయాయి” అంటూ ఈ దంపతులు సామాజిక మాధ్యమాల ద్వారా తమ జీవితంలోని ఈ సరికొత్త అధ్యాయాన్ని ప్రకటించారు. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ కావడంతో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు నెటిజన్లు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇప్పటికే వీరి ముద్దుల కూతురు గతేడాది జులై 16న జన్మించగా, ఇంతలోనే మరో చిన్నారి రాకపై సమాచారం రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 2021లో భారీ విజయాన్ని అందుకున్న ‘షేర్షా’ చిత్రంలో సిద్ధార్థ్, కియారాల స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సెట్స్ పైనే వీరి మధ్య మొదలైన పరిచయం క్రమంగా బలమైన ప్రేమగా మారింది. తమ ప్రేమ ప్రయాణం ఎలా మొదలైందో కియారా ప్రముఖ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 8లో సరదాగా పంచుకుని మురిసిపోయింది. ఆ తర్వాత 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్ వేదికగా అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఆదర్శ దంపతులుగా పేరుతెచ్చుకున్న ఈ జంట, ఇప్పుడు రెండోసారి తల్లిదండ్రుల బాధ్యతలను చేపట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోంది.