సినీ పరిశ్రమలో సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో వచ్చే రూమర్లు ఒక్కోసారి తీవ్ర దుమారం రేపుతుంటాయి. తాజాగా టాలీవుడ్, బాలీవుడ్‌లలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తనపై వస్తున్న తప్పుడు వార్తల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నివాసాలపై ఐటీ (ఇన్కమ్ టాక్స్) సోదాలు జరిగాయని, అలాగే భారీగా బినామీ ఆస్తులు ఉన్నాయంటూ కొన్ని మీడియా మాధ్యమాలలో ప్రసారమైన కథనాలపై ఆమె తీవ్రంగా స్పందించారు.
ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ పూర్తిగా నిరాధారమైనవని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో సుధీర్ఘ పోస్ట్ చేశారు. ఎలాంటి ప్రాథమిక సమాచారం లేకుండా, కేవలం సంచలనం కోసం కొందరు నిరాధారమైన వార్తలను ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు. తన ప్రతిష్టను దిగజార్చేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రసారమవుతున్న ఈ ఫేక్ వార్తలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె గట్టిగా డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన జర్నలిజం పేరుతో కొందరు ఇలాంటి తప్పుడు కథనాలు ప్రసారం చేయడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇలాంటి తప్పుడు వదంతులను ఎవరూ నమ్మవద్దని రకుల్ ప్రీత్ సింగ్ తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేశారు. ఒక సెలబ్రిటీ వ్యక్తిగత జీవితంపై, ఆర్థిక లావాదేవీలపై నిరాధారమైన ఆరోపణలు చేయడం చట్టరీత్యా కూడా నేరమని, భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
కనీస వాస్తవాలను పరిశీలించకుండా కేవలం సంచలనం కోసమే ఇలాంటి ఫేక్ రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. తాను సైనిక నేపథ్యం ఉన్న క్రమశిక్షణ ఉన్న కుటుంబం నుంచి పరిశ్రమలోకి అడుగుపెట్టానని.. చిత్రసీమలో తనకు ఎలాంటి గాడ్ ఫాదర్స్ అండదండలు లేవని అన్నారు. కేవలం తన సొంత శ్రమ, నిరంతర కృషి వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని గుర్తు చేసుకున్నారు. దేశ చట్టాలని గౌరవించే బాధ్యతాయుతమైన పౌరురాలిగా.. తన ఇరవైళ్ల ప్రాయం నుంచి ప్రభుత్వానికి ప్రతి రూపాయి పన్నును క్రమం తప్పకుండా చెల్లిస్తున్నానని అన్నారు.
తనకు విదేశీ లావాదేవీలు, బినామీ ఆస్తుల ఆరోపణలు ఆమె తోసిపుచ్చారు. వ్యక్తిగత హోదాలో కానీ లేదా ఏ నిర్మాణ సంస్థ తరుపున కానీ ఎలాంటి అక్రమ విదేశీ నగదు మార్పిడులలో తనకు ఎలాంటి ప్రమోయం లేదని అన్నారు. దేశంలో, విదేశాల్లో కానీ తనకు ఎవరి తరుపునా ఎలాంటి బినామీ ఆస్తులు లేవని అన్నారు. తన గురించి జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు.




