Reading Time: < 1 minute
Ysrcp Moves Supreme Court On Ap Local Body Elections Over Sir Voter List Issue

Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితా (SIR) అంశాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సంబంధించి తమ అభ్యంతరాలను అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ పిటిషన్‌ను వైఎస్సార్‌సీపీ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ సందర్భంగా వార్డుల సరిహద్దులు ఫ్రీజ్ కావన్న అంశాన్ని ధర్మాసనం పేర్కొంది. మున్సిపాలిటీ సరిహద్దుల ఫ్రీజింగ్ నిబంధన వార్డులకు వర్తించదని జస్టిస్ బాగ్చి తెలిపారు. మరోవైపు SIR ఆధారిత ఓటర్ల జాబితా పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. పాత ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించకుండా, కొత్త జాబితా పూర్తయిన తర్వాతే ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో ఏ క్షణంలోనైనా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని వైఎస్సార్‌సీపీ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ కీలకంగా మారింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను శుక్రవారం చేపడతామని సీజేఐ ధర్మాసనం తెలిపింది. దీంతో సుప్రీంకోర్టు విచారణపై ఇప్పడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.