
Sourav Ganguly Appointed Head Coach of Delhi Capitals: భారత క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సౌరవ్ గంగూలీ మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) హెడ్ కోచ్‌గా దాదా నియమితులయ్యారు. ఈ విషయాన్ని డీసీ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. గతంలో ఢిల్లీకి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా, మెంటార్‌గా పనిచేసిన గంగూలీ.. ఇప్పుడు తొలిసారి ఐపీఎల్ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
గతంలో రికీ పాంటింగ్ హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలోనూ ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ సెటప్‌లో సౌరవ్ గంగూలీ భాగంగా ఉన్నారు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లోని ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టుతో తన తొలి కోచింగ్ బాధ్యతలను స్వీకరించిన దాదా.. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ అదే పాత్రలో కనిపించనున్నాడు. గంగూలీ నియామకాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రత్యేక వీడియో ద్వారా ప్రకటించింది. ‘దాదా గిరి’ ఇకపై ఢిల్లీ క్యాపిటల్స్‌ను నడిపించబోతోంది అనే తరహాలో ఫ్రాంచైజీ ప్రకటన చేసింది. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. ఇన్నాళ్లు పక్కనుండి చూస్తూ, మార్గనిర్దేశం చేసిన సమయం ముగిసిందని.. ఇప్పుడు నేరుగా యాక్షన్‌లోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.
‘ఒక దశలో పక్కకు తప్పుకుని చూస్తూ, మార్గనిర్దేశం చేస్తే సరిపోతుందని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మనం ఎందుకు మొదలుపెట్టామో గుర్తు చేసే సందర్భాలు వస్తాయి. నాకు ఈ జట్టు అలాంటి గుర్తింపును ఇచ్చింది. ఢిల్లీ నా సమయం కోసం ఎదురుచూస్తోంది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. టైగర్ తిరిగొచ్చాడు’ అంటూ గంగూలీ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ చైర్మన్, సహ యజమాని పార్థ్ జిందాల్ గంగూలీ నియామకంపై సంతోషం వ్యక్తం చేశారు. గంగూలీ ఎప్పటినుంచో ఢిల్లీ క్యాపిటల్స్ కుటుంబంలో కీలక భాగమని, భారత క్రికెట్‌లో గొప్ప కెప్టెన్లలో ఒకరైన ఆయన ఇప్పుడు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందని అన్నారు. గంగూలీ నాయకత్వంలో ఢిల్లీ ఐపీఎల్ టైటిల్ కోసం మరింత బలంగా పోటీ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఆయన అనుభవం నుంచి ఎంతో నేర్చుకుంటారని జిందాల్ పేర్కొన్నారు.
ఫ్రాంచైజీ సహ యజమాని కిరణ్ కుమార్ గ్రంధి కూడా సౌరవ్ గంగూలీకి స్వాగతం పలికారు. ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ వ్యవస్థపై గంగూలీకి ఇప్పటికే లోతైన అవగాహన ఉందని, ఆయన అనుభవం, నాయకత్వ లక్షణాలు జట్టుకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడంపై గంగూలీ స్పందించారు. ‘ఐపీఎల్‌లో హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ఎదురుచూస్తున్నాను. ఢిల్లీ క్యాపిటల్స్ నాకు ఎంతో దగ్గరైన ఫ్రాంచైజీ. మేనేజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్, ఆటగాళ్లతో గతంలో కలిసి పనిచేశాను. మా జట్టులో ప్రతిభావంతమైన ఆటగాళ్లున్నారు. ఇటీవల కూడా జట్టు మంచి క్రికెట్ ఆడింది. ఇప్పుడు బలమైన, భయంలేని జట్టును నిర్మించడంపై దృష్టి పెడతాను’ అని గంగూలీ తెలిపాడు.
సౌరవ్ గంగూలీకి సహకరించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ భారీ కోచింగ్ బృందాన్ని సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. భారత మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ బ్యాటింగ్ కోచ్‌గా, శ్రీలంక మాజీ పేసర్ చమిందా వాస్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. అలాగే ఐపీఎల్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న అమిత్ మిశ్రాను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమించారు. గంగూలీతో పాటు అనుభవజ్ఞులతో కూడిన కోచింగ్ బృందం ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త దిశను చూపుతుందనే అంచనాలు ఉన్నాయి. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు టైటిల్ గెలవలేకపోయిన ఢిల్లీ.. గంగూలీ రాకతో ఈసారి ఆ కలను నెరవేర్చాలని చూస్తోంది. మరి ‘దాదా’ నాయకత్వంలో ఢిల్లీ ఏ స్థాయికి చేరుకుంటుందో చూడాలి.