Reading Time: < 1 minute
Chhattisgarh Acid Attack Woman Attacked After Rejecting Marriage Proposal 2 Arrested

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి ప్రతిపాదన తిరస్కరించిందనే కారణంతో 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. బాలోడ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు 20 ఏళ్ల యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు యశ్ కుమార్ సోంకర్, కరుణ్ కుంజామ్‌గా గుర్తించారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్న బాధితురాలు లైబ్రరీలో చదువుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.

గాయాలపాలైన బాధితురాలని బాలోద్ జిల్లా ఆస్పత్రికి తరలించగా, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూర్ తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సోంకర్ బాధితురాలిని పెళ్లి చేసుకోవాలని కోరగా, అందుకు ఆమె నిరాకరించినట్లు బాలోద్ ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. ఇదే కాకుండా ఆమె వేరే వ్యక్తితో మాట్లాడుతోందనే అనుమానాన్ని సోంకర్ పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన స్కూల్ ఫ్రెండ్ కరణ్ కుంజామ్‌తో కలిసి దాడికి ప్లాన్ చేసినట్లు వెల్లడించారు.

నిందితులు దాడికి ఉపయోగించిన యాసిడ్‌ను దుర్గ్ జిల్లా నుంచి వారం రోజుల ముందు కొనుగోలు చేశారు. దాడికి 3 నెలల నుంచి ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. సెప్టెంబర్ 27న యాసిడ్ కొనుగోలు చేసిన నిందితులు, గణేష్ ఊరేగింపు సమయంలో దాడి చేయాలని తొలుత భావించారు. కానీ భారీ భద్రతా ఏర్పాట్ల కారణంగా ప్లాన్‌ను విరమించుకున్నట్లు తేలింది. లైబ్రరీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో దాడి చేశారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో నిందితుల్ని గుర్తించారు.