
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల విద్యాలయంలో ఎలుకల సంచారం విద్యార్థినులను భయాందోళనకు గురిచేసింది.గురుకులంలో రాత్రి సమయంలో ఎలుకలు సంచరిస్తుండగా, ఐదో తరగతి చదువుతున్న సాయి హర్ష అనే విద్యార్థినిని ఎలుక కరిచి వేసింది. దీంతో వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గూడూరు ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న గూడూరు తహసీల్దార్ నాగ భవాణీ బాలికల గురుకుల విద్యాలయాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించి విద్యార్థినుల భద్రతకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
ఎలుకల భయంతో రాత్రి సమయంలో విద్యార్థినులు కాళ్లకు షూస్, బూట్లు ధరించి నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడిందని సమాచారం. దీంతో విద్యార్థినుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థినులకు పూర్తి రక్షణ కల్పించాలని, గురుకులంలో ఎలుకల సమస్యను తక్షణమే పరిష్కరించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్‌లో పరిశుభ్రత, భద్రతా చర్యలను పటిష్టం చేయాలని కోరుతున్నారు.
ALSO READ : సచివాలయానికి నీళ్లు బంద్ ప్రచారంపై.
ఇదిలా ఉండగా, విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు గురుకులంలో వైద్య సిబ్బంది హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు.
గురుకులంలో ఎలుకల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు విద్యార్థినుల భద్రతకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.