Reading Time: 2 minutes
Hyderabad: పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్.. అప్పటికల్లా పూర్తి.. అందుబాటులోకి ఎప్పుడంటే..?

హైదరాబాద్ ప్రజలకు జీహెచ్‌ఎంసీ భారీ శుభవార్త అందించింది. పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మధ్య నిర్మించిన భారీ ఫ్లైఓవర్‌పై కీలక అప్డేట్ వచ్చింది. ఈ ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి జీహెచ్ఎంసీ నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. తాజాగా దీని నిర్మాణంపై రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రభుత్వం నుంచి ఫ్లైఓవర్ నిర్మాణానికి అధికారికంగా ఆమోదం వచ్చినట్లయింది. కేవలం రెండేళ్లలోనే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ ఉత్తర్వుల్లో తెలిపారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఇది పూర్తయితే పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, మాదాపూర్, హైటెక్ సిటీ వైపు ప్రయాణం మరింత సులభతరం కానుంది. ట్రాఫిక్ ఫ్రీ జర్నీతో వాహనాలు వేగంగా వెళ్లనున్నాయి.

రెండు ప్యాకేజీలుగా పనులు..

పంజాగుట్ట నాగార్జున సర్కిల్, టీవీ9 సర్కిల్, ముగ్ద జంక్షన్, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సిగ్నల్స్ వద్ద రద్దీ సమయాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ఫ్లైఓవర్ నిర్మించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలపడంతో త్వరలో పనులు మొదలుకానున్నాయి. రద్దీ సమయంలో ఈ మార్గంలో ప్రయాణించాలంటే అదనంగా 20 నిమిషాల సమయం పడుతుంది. ఇప్పుడు ఈ మార్గంలో పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ వరకు నాలుగు కిలోమీటర్ల మేర భారీ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఆరు వరుసలుగా ఉంటుంది. జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ముగ్ద జంక్షన్ వరకు ఒక ప్యాకేజీగా.. ముగ్ద జంక్షన్ నుంచి ముఫకంజా కాలేజీ వరకు రెండో ప్యాకేజీగా పనులు చేపట్టనున్నారు.

ట్రాఫిక్ రద్దీకి చెక్

ఈ ప్రాజెక్ట్ పూర్తయితే పంజాగుట్ట నాగార్జున సర్కిల్, కేబీఆర్ పార్క్, మాదాపూర్ మధ్య ట్రాఫిక్ రద్దీ తగ్గే ఛాన్స్ ఉంది. ఫ్లైఓవర్ పైనుంచి వాహనాలు వెళ్లడం వల్ల ట్రాఫిక్ జామ్ ఉండదు. పంజాగుట్ట నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లేవారికి ప్రయోజకరంగా ఉండనుంది. అయితే ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు నగరంలో ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లను జీహెచ్‌ఎంసీ నిర్మిస్తోంది. ఇప్పటికే పలు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. అలాగే కొత్త ప్రాజెక్టులకు కూడా ప్రణాళికలు రూపొందిస్తోంది. దీని వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వతగా పరిష్కారం చూపాలని చూస్తోంది. వేగవంతంగా ఫ్లైఓవర్ పూర్తి చేసేలా చర్యలు చేపడుతోంది.