Reading Time: 2 minutes

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ వ్యతిరేకంగా.. మాజీ ఐఏఎస్ ల ప్రజాఅభిశంసన నోటీసు

Caption of Image.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ కు వ్యతిరేకంగా మాజీ ఐఏఎస్ అధికారులు, పౌర సమాజ ప్రతినిధుల బృందం ప్రజా అభిశంసన నోటీసు జారీ చేశారు. మాజీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ (మాజీ IAS), మాజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి జి.కె. పిళ్లై (మాజీ IAS), అమితాబ్ పాండే (మాజీ IAS), సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ వంటి ప్రముఖులతో కూడిన బృందం ఈ నోటీసు ఇచ్చింది.  సీఈసీపై ఆరు ప్రధాన ఆరోపణలను ఈ నోటీసులో తెలిపింది.

అంతకుముందు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై ప్రజల అభిశంసన నోటీసు  జారీ చేసేందకు కేంద్ర ఎన్నికల సంఘం ఆఫీసు దగ్గరకు వెళ్లిన ప్రతినిధి బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అపాయింట్‌మెంట్ కోరినప్పటికీ తమను ఈసీఐకి చేరకుండా ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారని మాజీ ఐఏఎస్ ల బృందం సోమవారం తెలిపింది. అనంతరం ఆ ప్రతినిధి బృందం ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఆ నోటీసును ప్రజలకు విడుదల చేసింది.

సమష్టి నిర్ణయాలను పక్కనబెట్టడం..ఎన్నికల సంఘం (ECI) నిబంధనల ప్రకారం ముగ్గురు కమిషనర్లు సమష్టిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా, సీఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఇతర కమిషనర్ల అధికారాలను కాలరాస్తున్నారని ఆరోపించారు. 

ఫారమ్ 6 అనధికారిక మార్పులు: ఓటరు నమోదుకు సంబంధించిన  ఫారం6 లో చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా, ఏకపక్ష పరిపాలనా ఉత్తర్వుల ద్వారా అదనపు నిబంధనలను చేర్చి అనధికారిక మార్పులు చేశారు. 

ఓటర్ల జాబితా పరిపాలన కేంద్రీకరణ.. ఓటర్ల జాబితా నిర్వహణ ,సవరణల అధికారాలను ఒకే చోట కేంద్రీకరించడం ద్వారా వ్యవస్థను దెబ్బతీశారు. 

ఓట్ల తొలగింపు (Mass Disenfranchisement).. ఓటర్ల జాబితాల సవరణ కోసం చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియ వల్ల ఎటువంటి ముందస్తు శిక్షణ ,సరైన వ్యవస్థలు లేకుండా లక్షలాది మంది ఓటర్లను  ముఖ్యంగా మహిళలు, వలసదారులు, మైనారిటీలు, పేదలు ఓటరు జాబితా నుంచి  తొలగించారు. 

పక్షపాత వైఖరి.. సీఈసీ ప్రవర్తన ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉందనే అనుమానాలను రేకెత్తిస్తోందని, తద్వారా ఎన్నికల సంఘం స్వతంత్రతను ,నిష్పాక్షికతను దెబ్బతీశారని ఆరోపించారు. 

విధుల ఉల్లంఘన..ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950 లోని సెక్షన్ 32(1) ప్రకారం ఓటర్ల జాబితా తయారీ ,సవరణలలో ఉద్దేశపూర్వకంగా అధికారిక విధులను ఉల్లంఘించారని ఆరోపించారు.

ఈ ఆరోపణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) కింద  నిరూపితమైన దుష్ప్రవర్తన పరిధిలోకి వస్తాయని, అందువల్ల ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని లేదా ఆయనను పదవి నుంచి తొలగించాలని ఈ బృందం డిమాండ్ చేసింది.

చట్టసభల ద్వారా కాకుండా పౌరుల తరఫున రాజ్యాంగ సంస్థలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనాన్ని ప్రశ్నించడానికి పౌర సమాజం ఉపయోగించే ఓ నైతిక నిరసన రూపం ఇది.

©️ VIL Media Pvt Ltd.