
హైదరాబాద్: ఫార్చ్యూన్ 99 హోమ్స్‌లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందని నమ్మించి రూ.25 లక్షలు తీసుకున్న కేసులో నిందితుడు మధిరాల రోసి రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలోని మైహోమ్ భూజా వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఫార్చ్యూన్ 99 హోమ్స్‌లో పెట్టుబడి పెడితే 30 శాతం అధిక రాబడి వస్తుందని నమ్మించి బాధితుడి నుంచి రూ.25 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మూడు నెలల్లో రూ.32.50 లక్షలు తిరిగి చెల్లిస్తామని నిందితుడు హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
అదే సమయంలో గడువులోగా డబ్బులు చెల్లించకపోతే జడ్చర్లలో 1,000 గజాల స్థలాన్ని ఇస్తామని హామీ ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే గడువు ముగిసినప్పటికీ డబ్బులు చెల్లించకుండా నిందితుడు తప్పించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు పలు కీలక పత్రాలను సేకరించారు. MOUలు, ప్లాట్ అలాట్‌మెంట్ రసీదు, చెక్కులు తదితర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అధిక రాబడి వస్తుందంటూ ఆశ చూపించడం, ఒప్పందాలు మరియు ప్లాట్ హామీలతో నమ్మించడం, అనంతరం డబ్బులు తిరిగి చెల్లించకుండా తప్పించుకోవడం నిందితుడి మోడస్ ఆపరెండిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.అంతేకాకుండా మధిరాల రోసి రెడ్డిపై గతంలోనూ CCS, బంజారాహిల్స్, గ్రీన్ ఫార్మా సిటీ, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.