
నాన్‌వెజ్ ప్రియులకు చికెన్ 65 పేరు వింటేనే నోరూరిపోతుంది. రెస్టారెంట్‌కు వెళ్లినా, దాబాలో కూర్చున్నా, ఇంట్లో పార్టీ చేసుకున్నా స్టార్టర్లలో మొదటి ఛాయిస్ ఇదే. ఎర్రటి రంగు, కరకరలాడే ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి తాలింపుతో అదిరిపోయే ఈ డిష్ గురించి అందరికీ తెలుసు కానీ.. దీనికి 65 అనే పేరు ఎందుకు వచ్చింది? అసలు ఈ వంటకాన్ని మొదట ఎవరు కనిపెట్టారు? అనే విషయంలో మాత్రం బోలెడన్ని ఆసక్తికరమైన కథలు, సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. చికెన్ 65 పుట్టుకకు సంబంధించి అత్యంత ప్రాచుర్యం పొందిన, నిజమైన ఆధారాలు ఉన్న కథ చెన్నైకి చెందిన ప్రసిద్ధ బుహారీ హోటల్ ఈ హోటల్ వ్యవస్థాపకుడు ఎ.ఎం. బుహారీ 1965లో సరికొత్త మసాలాలతో ఓ ప్రత్యేకమైన చికెన్ స్టార్టర్‌ను మెనూలోకి తీసుకొచ్చారు. 1965వ సంవత్సరంలో దీన్ని ప్రవేశపెట్టడం వల్లే ఆ వంటకానికి ‘చికెన్ 65’ అని పేరు పెట్టారు. అంతేకాదు, ఈ హోటల్‌లో ఆ తర్వాత 1982లో ‘చికెన్ 82’, 1990లో బోన్‌లెస్ వెర్షన్‌తో ‘చికెన్ 90’ వంటి డిష్‌లను కూడా పరిచయం చేశారు. బుహారీ హోటల్ ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ చికెన్ 65ను బోన్స్‌తో తయారుచేస్తారు. అల్లం, వెల్లుల్లి, ఎర్రకారం, పసుపు లాంటి సాధారణ మసాలాలతో మాత్రమే దీన్ని మ్యారినేట్ చేస్తారు. ప్రస్తుతం మార్కెట్‌లో దొరికేలా ఇందులో పెరుగు లేదా కార్న్‌ఫ్లోర్ ఎక్కువగా వాడరు.
మన హైదరాబాదీ- తెలుగు స్టైల్ వేరు
ఈ డిష్ చెన్నైలో పుట్టినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా చికెన్ 65 అంటే పాపులర్ అయింది మాత్రం మన హైదరాబాదీ స్టైల్ వల్లే. 1990ల కాలంలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో బోన్‌లెస్ చికెన్‌ను పెరుగు, నిమ్మరసం, అల్లం-వెల్లుల్లి, గుడ్డు, కార్న్‌ఫ్లోర్‌తో కలిపి డీప్ ఫ్రై చేసి.. ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకుతో తాలింపు వేసే విధానం మొదలైంది. ఈ స్పైసీ టచ్ చికెన్ 65కి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. పాతబస్తీలోని చార్మినార్ వద్ద ఉన్న అక్బర్ హోటల్ కూడా 90లలో తామే దీన్ని విభిన్న శైలిలో రూపొందించామని చెబుతుంటుంది.
ప్రచారంలో ఉన్న వింత సిద్ధాంతాలు.. నిజమెంత?
చికెన్ 65 పేరు వెనుక అనేక రకాల పుకార్లు, సరదా కథనాలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి.
మెనూ కార్డులో 65వ ఐటమ్: చెన్నైలోని ఒక మిలిటరీ హోటల్‌లో సైనికుల కోసం తయారుచేసిన మెనూలో ఇది 65వ నంబర్ ఐటమ్ అని, అందుకే ఆర్డర్ సులభం కావడానికి చికెన్ 65 అని పిలిచారని కొందరు చెబుతారు.
65 రోజుల కోడిపిల్ల: సరిగ్గా 65 రోజుల వయసున్న కోడి మాంసంతోనే ఈ డిష్ చేస్తారని మరో కథనం. కానీ కోడి వయసును కచ్చితంగా లెక్కించి వంట చేయడం అసాధ్యమని చెఫ్‌లు కొట్టిపారేస్తారు.
65 ముక్కలు: ఒక పూర్తి కోడిని సరిగ్గా 65 చిన్న చిన్న ముక్కలుగా కోసి చేస్తారని అంటారు. అయితే సాధారణంగా కూరకు కోసే చికెన్ 20-22 ముక్కలు మాత్రమే అవుతుంది, 65 ముక్కలు కోస్తే అసలు ముక్కలే మిగలవని వంట నిపుణులు నవ్వుకుంటారు.
65 మసాలాలు: ఇందులో 65 రకాల విభిన్న మసాలా దినుసులు లేదా 65 పచ్చిమిరపకాయలు వాడతారని ఇంకొందరి వాదన. కానీ వాస్తవానికి ఇందులో వాడేది నాలుగైదు సాధారణ భారతీయ మసాలాలు మాత్రమే.
చెట్టినాడు సిద్ధాంతం: చెట్టియార్లు సైనికుల కోసం లేదా ప్రయాణాల కోసం 65 రోజులు నిల్వ ఉండేలా ఎండబెట్టి చేసిన వంటకం అని మరో ప్రచారం ఉన్నా, దీనికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు.
ఏదేమైనా.. 1965లో చెన్నై బుహారీ హోటల్‌లో మొదలైన ఈ రుచుల ప్రయాణం, తెలుగు వారి చేతుల్లో పడి మరింత స్పైసీగా మారి.. నేడు ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ రెస్టారెంట్లలో టాప్ స్టార్టర్‌గా రాజ్యమేలుతోంది.