
దసరా పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 7,000 ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశమున్న ఈ నెల 9, 10, 16, 17 తేదీలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసింది. అలాగే పండుగ ముగిసిన తర్వాత తిరిగి నగరాలకు వచ్చే ప్రయాణికుల కోసం ఈ నెల 25, 26 తేదీల్లో కూడా తిరుగు ప్రయాణ రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులను సిద్ధం చేసింది.
ఏ జోన్ నుంచి ఎన్ని బస్సులంటే?
ప్రయాణికుల రాకపోకలకు వీలుగా జోన్ల వారీగా ప్రత్యేక బస్సులను ఆర్టీసీ విభజించింది. కరీంనగర్ జోన్ పరిధి నుంచి అత్యధికంగా 3,533 బస్సులను నడపనున్నారు. ఇందులో రీజియన్ల వారీగా చూస్తే ఆదిలాబాద్ నుంచి 431, నిజామాబాద్ నుంచి 719, కరీంనగర్ నుంచి 1,175, వరంగల్ నుంచి 530, ఖమ్మం నుంచి 678 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇక హైదరాబాద్ జోన్ నుంచి మొత్తం 2,155 ప్రత్యేక బస్సులు నడుస్తుండగా, రీజియన్ల వారీగా మహబూబ్ నగర్ నుంచి 645, మెదక్ నుంచి 255, నల్గొండ నుంచి 815, రంగారెడ్డి నుంచి 440 బస్సులను కేటాయించారు. ఇవే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రధాన బస్ స్టేషన్లు, పాయింట్ల నుంచి పండుగ కోసం ప్రత్యేకంగా మరో 1,312 ప్రత్యేక సర్వీసులను నడపాలని నిర్ణయించారు.
ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధరల సవరణ
పండుగ రద్దీ సమయంలో నడిచే ఈ ప్రత్యేక బస్సులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం టికెట్ ధరల్లో మార్పులు చేశారు. సాధారణ చార్జీలపై 1.5 రెట్ల వరకు ధరలను సవరిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రయాణికులు ముందస్తుగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకుని, ఆర్టీసీ అందిస్తున్న ఈ ప్రత్యేక బస్సు సర్వీసులను వినియోగించుకోవాలని అధికారులు కోరారు.