Reading Time: < 1 minute
Erravalli Land Survey 45 Acres Revanth Reddy Kcr Family Notices

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, దాని శివారు వెంకటాపురం గ్రామాల భూముల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సదరు గ్రామాల్లో చేపట్టిన సర్వే వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో రెవెన్యూ రికార్డుల ప్రకారం మొత్తం 388 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా, ఇటీవల అధికారులు నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో కేవలం 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు తేలింది. ఈ సర్వే నంబర్‌లో మిస్సయిన 45 ఎకరాల భూమి ఎక్కడికి పోయిందో తక్షణమే తేల్చాలని అధికారులను సీఎం ఆదేశించారు. ల్యాండ్ రికార్డులను పక్కాగా సరిచూసి భూమిని గుర్తించడం కోసం ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల్లో సర్వే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

కేసీఆర్ కుటుంబానికి నోటీసులు.. అర్హులైన రైతులకు భూముల పంపిణీ

మిస్సయిన భూమి సరిహద్దుల్లో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)తో పాటు ఆయన కుటుంబ సభ్యుల భూములు ఉన్నందున, వారికి సంబంధిత రెవెన్యూ రికార్డులను సమర్పించాలని కోరుతూ నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. రికార్డులు పరిశీలించి, భూ సరిహద్దులను లెక్క తేల్చనున్నారు. కాగా, సర్వే నంబర్ 325 పరిధిలో గుర్తింపు పొందే సరిహద్దు భూమిని స్థానికంగా ఉన్న అర్హులైన పేద రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

తెలంగాణ అమరవీరుల కాలనీగా నిర్మాణం.. హౌసింగ్ బోర్డుకు బాధ్యతలు

తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాల కోసం అదే సర్వే నంబర్ 325లో ‘తెలంగాణ అమరవీరుల కాలనీ’ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కాలనీలో అమరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించడంతో పాటు, సకల మౌలిక వసతులతో సమగ్ర రూపురేఖలు దిద్దాలని సూచించారు. ఈ కాలనీ నిర్మాణ బాధ్యతలను తెలంగాణ హౌసింగ్ బోర్డుకు అప్పగించాలని ఆదేశించిన సీఎం, వచ్చే జూన్ 2వ తేదీ (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) నాటికి నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని స్పష్టమైన గడువు విధించారు.