
కరీంనగర్: లంచం ఆరోపణలతో కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. జేసీబీ, ట్రాక్టర్లను విడుదల చేసేందుకు లంచం డిమాండ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో తిమ్మాపూర్ సీఐ రమేష్, ఎస్ఐ అన్వర్‌ను బదిలీ చేశారు. వారితో పాటు అవినీతికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో కానిస్టేబుల్‌ను కూడా హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
బాధితుడి ఆరోపణల ప్రకారం.. సీజ్ చేసిన జేసీబీ, ట్రాక్టర్లను విడుదల చేసేందుకు పోలీసులు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఒప్పందంలో భాగంగా రూ.10 వేల నగదును ఇవ్వడంతో పాటు, వైన్ షాప్ నిర్వాహకులకు రూ.20 వేల నగదును ఫోన్‌పే ద్వారా చెల్లించినట్లు బాధితుడు నగునూరి బాబు తెలిపాడు.
ఇదిలా ఉండగా, తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి జరిమానా చలానా ఆధారంగా వాహనాల విడుదలకు ఉత్తర్వులు ఇచ్చినా పోలీసులు వాటిని విడుదల చేయలేదని బాధితుడు ఆరోపించారు. అదనంగా డబ్బులు ఇస్తేనే వాహనాలను అప్పగిస్తామని, లేదంటే కోర్టుకు పంపిస్తామని సీఐ రమేష్ బెదిరించినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై పత్రికలు, టీవీ ఛానెళ్లలో కథనాలు వెలువడటంతో పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తిమ్మాపూర్ సీఐ రమేష్, ఎస్ఐ అన్వర్‌తో పాటు మరో కానిస్టేబుల్‌ను కూడా బదిలీ చేసి హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. అయితే లంచం ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలు, పోలీసుల అధికారిక విచారణలో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.