
హైదరాబాద్ లోని బేగంబజార్‌లో వాచ్ వ్యాపారిని కత్తితో బెదిరించి రూ.9.50 లక్షల నగదును దోచుకున్న ఘటన కలకలం రేపింది. గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంబజార్ అజీజ్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
వ్యాపారానికి సంబంధించిన చెల్లింపులను వసూలు చేసుకుని వెళ్తున్న బాధితుడిని గుర్తుతెలియని వ్యక్తి వెనుక నుంచి వచ్చి కత్తితో బెదిరించాడు. దీంతో ప్రాణభయానికి గురైన బాధితుడు తన వద్ద ఉన్న రూ.9.50 లక్షల నగదు బ్యాగ్‌ను అక్కడే పడేశాడు. నిందితుడు ఆ నగదును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడిని అడ్డుకునేందుకు బాధితుడు ప్రయత్నించగా, అతడి చేతులు, మెడకు గాయాలైనట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న గోషామహల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించగా నిందితుడి కదలికలు పోలీసులకు లభించాయి. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని బహదూర్‌పురాకు చెందిన జహీర్గా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
అజీజ్ ప్లాజాలో జహీర్ వాచ్ రిపేర్ షాప్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడి కోసం గోషామహల్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.