
IND A vs Aus A: పుదుచ్చేరి వేదికగా జరిగిన మొదటి అనధికారిక వన్డేలో ఇండియా-ఎ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆస్ట్రేలియా-ఎ చేతిలో ఏకంగా 125 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత యువ జట్టు, ఆసీస్ బౌలర్ల ధాటికి తాళలేక కేవలం 149 పరుగులకే కుప్పకూలిపోయింది. మొదటి ఇన్నింగ్స్ తర్వాత విజయం మనదే అనుకున్న అభిమానులకు ఛేజింగ్‌లో భారత బ్యాటర్లు తీవ్ర నిరాశ మిగిల్చారు.
87 రన్స్‌కే 5 వికెట్లు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా-ఎ జట్టుకి ప్రారంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. భారత బౌలర్ సూర్యాంశ్ షెడ్గే ధాటికి కేవలం 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఆ సమయంలో ఆసీస్ జట్టు కనీసం 150 పరుగులు కూడా చేయదేమో అనిపించింది. కానీ నాలుగో స్థానంలో వచ్చిన నాథన్ మెక్‌స్వీనీ అద్భుత సెంచరీ (135 బంతుల్లో 123 పరుగులు, 13 ఫోర్లు)తో జట్టును ఆదుకున్నాడు.
మెక్‌స్వీనీ, సుదర్‌లాండ్ భాగస్వామ్యం
కెప్టెన్ విల్ సుదర్‌లాండ్‌తో కలిసి నాథన్ మెక్‌స్వీనీ ఆరో వికెట్‌కు ఏకంగా 141 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సుదర్‌లాండ్ కూడా 2 ఫోర్లు, 4 సిక్సర్లతో విరుచుకుపడి 77 పరుగులు సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా-ఎ జట్టు 48.2 ఓవర్లలో 274 పరుగుల గౌరవప్రదమైన స్కోరుకు చేరుకుని ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. ఇండియా-ఎ బౌలర్లలో సుర్యాంశ్ షెడ్గే 4 వికెట్లతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.
కుప్పకూలిన భారత బ్యాటింగ్ లైనప్
275 పరుగుల ఛేజింగ్ ప్రారంభించిన ఇండియా-ఎ జట్టు ఆదిలోనే తడబడింది. స్కోరు బోర్డుపై కేవలం 12 పరుగులు ఉన్నప్పుడే తొలి వికెట్ కోల్పోగా, 58 రన్స్ అయ్యేసరికి ఏకంగా 4 వికెట్లు నేలకూలాయి. రజత్ పటీదార్ 53 పరుగులతో (5 ఫోర్లు, 1 సిక్సర్) కాస్త పోరాడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా, అతనికి సహకరించే బ్యాటర్ కరువయ్యాడు.
149 రన్స్‌కే ఆలౌట్
105 పరుగుల వద్ద ఐదో వికెట్ పడిన తర్వాత భారత ఇన్నింగ్స్ కట్టలు తెంచుకున్నట్టు పడిపోయింది. 118 పరుగులకు ఆరో వికెట్, 138 పరుగులకు ఏడో వికెట్ కోల్పోగా, చివరికి 149 పరుగుల వద్దే మిగిలిన మూడూ వికెట్లు వరుసగా పడిపోయాయి. దీంతో 31.4 ఓవర్లలోనే భారత్ కథ ముగిసింది. ఆస్ట్రేలియా-ఎ బౌలర్లలో మహ్లీ బియర్డ్‌మాన్ 4 వికెట్లు తీసి భారత బ్యాటింగ్ వెన్ను విరిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..