Reading Time: 2 minutes

ఆధార్‌ కార్డులో వివరాలు తప్పుగా ఉన్నాయా ?: పేరు, స్పెల్లింగ్ మార్పులు ఇలా ఈజీగా మార్చుకోవచ్చు !

Caption of Image.

ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడానికి లేదా తప్పుడు సరిదిద్దుకోవడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కొత్త ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (SOP) అందుబాటులోకి తెచ్చింది. ఆధార్‌లో   స్పెల్లింగ్ తప్పులు, పెళ్లి  తర్వాత ఇంటి పేరు మార్పు, పేర్ల వరుస క్రమం మార్చడం వంటి చాల  అంశాలకు సంబంధించిన నిబంధనలను ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు.

ఆధార్‌లో పేరు మార్పులు 
పేరులో మొదటి అక్షరాలను (ఇనిషియల్స్) పూర్తి పేరుగా మార్చుకోవచ్చు లేదా పెద్ద పేరును ఇనిషియల్స్‌గా మార్చుకోవచ్చు. మీ పేరులో మధ్య పేరును జోడించడం లేదా తీసివేయడం చేయవచ్చు. అంతేకాకుండా పేరు ముందు, వెనుక ఉన్న పదాల వరసను మార్చుకోవచ్చు. 

స్పెల్లింగ్ లేదా తప్పులు సరిదిద్దడం 
ఇంగ్లీష్ లేదా ప్రాంతీయ భాషలలో స్పెల్లింగ్ పొరపాట్లు ఉంటే బర్త్ సర్టిఫికెట్ లేదా ఐడీ ప్రూఫ్ ఆధారంగా సరిచేసుకోవచ్చు. గతంలో ఇచ్చిన డాకుమెంట్స్ లో పేరు సరిగ్గా ఉండి, ఆధార్ సిస్టమ్‌లో తప్పుగా నమోదైతే, పాత డాకుమెంట్స్ పరిశీలించి ఫ్రీగా  సరిచేస్తారు.

పెళ్లి తర్వాత ఇంటిపేరు మార్పు 
మహిళలు పెళ్లి లేదా విడాకుల తర్వాత ఇంటిపేరును మార్చుకోవడానికి ఐడీ ప్రూఫ్‌తో పాటు అనుబంధం-D (Annexure-D) సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆధార్‌లో పేరు మార్పు/సవరణ ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లో చేయడం వీలుకాదు. కాబట్టి  ఆధార్ సెంటరుకు  నేరుగా వెళ్ళి అప్‌డేట్ చేయించుకోవాలి:

స్టెప్ 1: మీకు దగ్గరలో  ఉన్న ఆధార్ సేవా కేంద్రం  లేదా ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించండి.

స్టెప్ 2: మీ ఆధార్ కార్డుతో పాటు, సరైన పేరు ఉన్న ఒరిజినల్ గుర్తింపు రుజువు  వెంట తీసుకెళ్లండి.

స్టెప్ 3: అక్కడి ఆపరేటర్‌కి  పేరు సవరణ ఫారమ్ నింపి  ఇవ్వండి.

స్టెప్ 4: ఆపరేటర్ మీ వివరాలు ఉన్న డాకుమెంట్స్ స్కాన్ చేసి, అవసరమైన చోట బయోమెట్రిక్ (వేలిముద్రలు/ఐరిస్) వెరిఫికేషన్ తీసుకుంటారు.

స్టెప్ 5: డెమోగ్రాఫిక్ అప్‌డేట్ కోసం నిర్ణయించిన చార్జెస్ రూ. 50 చెల్లించండి.

స్టెప్ 6: రసీదుగా అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) ఉన్న స్లిప్‌ను తీసుకోండి. దీని ద్వారా మీ అప్‌డేట్ స్టేటస్ ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయవచ్చు.

పేరు మార్పుకు  కావాల్సిన ఐడి ప్రూఫ్స్:
*పాస్‌పోర్ట్ / పాన్ కార్డ్ / ఓటరు ఐడీ
*డ్రైవింగ్ లైసెన్స్ / రేషన్ కార్డ్ / పిడిఎస్ ఫోటో కార్డ్
*ప్రభుత్వ/పిఎస్‌యు సర్వీస్ ఫోటో ఐడీ / పెన్షనర్ ఫోటో కార్డ్
*పేరు మార్పుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ 
*వివాహ సర్టిఫికెట్
*ఫోటో ఉన్న బ్యాంక్ పాస్‌బుక్ / వర్సిటీ, స్కూల్ లీవింగ్/ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్
 

©️ VIL Media Pvt Ltd.