
ట్రాక్ డ్రెస్, రన్నింగ్ షూస్, ఎనర్జీ డ్రింక్స్.. ఇలా అన్ని సదుపాయాలు ఉన్నా కూడా కొందరు పోలీస్ రిక్రూట్‌మెంట్ ఈవెంట్స్‌లో పరుగు పందెం పూర్తి చేయలేకపోతుంటారు. కానీ ఇక్కడో మహిళ పట్టుదల ముందు ఆ సకల సౌకర్యాలు దిగదుడుపయ్యాయి. కాళ్లకు బూట్లు లేవు.. పరుగుకు సౌకర్యంగా ఉండే ప్రత్యేక దుస్తులూ లేవు.. పైగా నడి నెత్తిన మండుటెండ. అయినా ఆ మహిళ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. కట్టుకున్న చీరను నడుముకు బిగించి ఏకంగా 1,600 మీటర్ల పరుగును దిగ్విజయంగా పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా పరిధిలోని వివిధ బ్లాకుల్లో తాజాగా 284 హోంగార్డు పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 24 అక్టోబర్ నుంచి నవంబర్ 5 వరకు ఈ ఎంపిక ప్రక్రియ జరగనుంది. అయితే ఈ రిక్రూట్‌మెంట్‌లో మహిళలకు ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్ కల్పించింది. అంతేకాకుండా వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలకు అదనంగా మరో 5 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కేటాయించారు. దీంతో స్థానికంగా ఉన్న మహిళా అభ్యర్థులు.. ఈ పోస్టులకు భారీగా దరఖాస్తు చేసుకున్నారు.
ట్రయల్ రన్‌లో మెరిసిన పట్టుదల..
అయితే అభ్యర్థులను ఎంపిక చేసే ముందు అభ్యర్థులకు రామ్‌గఢ్‌లోని సిద్ధో-కాన్హూ మైదానంలో ట్రయల్ రన్ నిర్వహించారు. అక్టోబర్ 2, 4 తేదీల్లో నిర్వహించిన ఈ పరుగు పోటీల్లో పెద్ద సంఖ్యలో మహిళా అభ్యర్థులు పాల్గొన్నారు. ఇలా ఈవెంట్స్ కోసం వచ్చిన అభ్యర్థుల్లో ఓ మహిళ చీరకట్టుతోనే 1600 మీటర్లు పరుగెత్తి ఎందరో యువతులను వెనక్కి నెట్టి తన లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది.
నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
మైదానంలో ఆ మహిళ పరుగు ముగించగానే అక్కడున్న వారంతా చప్పట్లతో ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. చీరకట్టుతో పరుగెత్తిన ఆ మహిళ లక్ష్యం కేవలం ఉద్యోగం సాధించడమే కాదు.. తన కుటుంబ ఆశలను నిలబెట్టడం కూడా కావడంతో ఆమె సంకల్పానికి ప్రతి ఒక్కరూ సలాం చేస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పలువురు మహిళలు చీరలు కట్టుకుని పరుగెత్తడమే కాకుండా ట్రయల్స్‌లో అర్హత కూడా సాధించారని నిర్వాహకులు వెల్లడించారు.
వీడయో చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.