Reading Time: < 1 minute
Town Planning Officer Sunita Trap Rs 6 50 Lakh Bribe In Dead Drop Method

Bribe in Dead Drop Method: లంచం తీసుకోవడంలో కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారనే ఆరోపణలతో టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ఏసీబీకి చిక్కిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా డ్రగ్స్ సరఫరాలో వినియోగించే ‘డెడ్ డ్రాప్’ తరహాలోనే లంచం డబ్బులు తీసుకునేందుకు ఆమె ప్రయత్నించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఓ వ్యాపారవేత్త నుంచి లంచం కోసం సునీత ఏకంగా రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. అంత మొత్తం ఇవ్వలేనని బాధితుడు చెప్పడంతో కనీసం రూ.8 లక్షలు ఇవ్వాలని ఆమె షరతు పెట్టినట్లు తెలుస్తోంది. చివరకు టోకెన్ అమౌంట్‌గా రూ.4 లక్షలు ఇవ్వడానికి వ్యాపారవేత్త అంగీకరించినట్లు సమాచారం.

అయితే డబ్బులను నేరుగా తన చేతికి ఇవ్వకుండా సునీత ప్రత్యేక పద్ధతిని అనుసరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రద్దీగా ఉండే ప్రాంతంలో తన కారును ఆపి, కారు డిక్కీని తెరిచి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. లంచం ఇచ్చే వ్యక్తి ఆ డిక్కీలో డబ్బులు పెట్టి, అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆమె సూచించినట్లు సమాచారం.

బాధితుడు సునీత సూచన మేరకు రూ.4 లక్షలను కారు డిక్కీలో ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఏసీబీ అధికారులు పర్యవేక్షిస్తూ, అనంతరం కారును స్వాధీనం చేసుకుని డిక్కీలో ఉన్న లంచం డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగడంతో సునీత షాక్‌కు గురైంది. తన చేతులతో డబ్బులు ముట్టుకోలేదని, డిక్కీలోకి డబ్బులు ఎలా వచ్చాయో తనకు తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా చేతులకు రసాయన రంగు అంటుకుంటేనే లంచం తీసుకున్నట్లు నిర్ధారణ అవుతుందని వాదించారు కూడా.

సునీత గతంలోనూ ఇదే తరహా పద్ధతిలో లంచం తీసుకున్నట్లు ఏసీబీ విచారణలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. మరో బాధితుడు సుమారు రూ.2.50 లక్షలను కూడా ఆమె కారు డిక్కీలోనే ఉంచి వెళ్లినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో రెండు వ్యవహారాలకు సంబంధించి మొత్తం రూ.6.50 లక్షల లంచం డబ్బులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నేరుగా డబ్బులు తీసుకోకుండా ‘డెడ్ డ్రాప్’ తరహా విధానాన్ని ఉపయోగించి లంచం స్వీకరించేందుకు ప్రయత్నించిన ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.