
న్యూఢిల్లీ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సోదరులపై తాను మాట్లాడినట్టు వస్తున్న వీడియోలు పూర్తిగా ట్యాంపరింగ్ చేసినవేనని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు, మీడియా కమిటీ చైర్మన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో చేసిన అవినీతి, ఆస్తుల దోపిడీ బయటపడుతుందనే భయంతోనే ఆ పార్టీ తనను టార్గెట్ చేసిందని ఆరోపించారు.
ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే తన వాయిస్, వీడియోలను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన వాయిస్, వీడియోలను ట్యాంపరింగ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న వారిపై కచ్చితంగా కేసులు పెడతానని హెచ్చరించారు.