Reading Time: < 1 minute
Naga Vamsi Film Release Delay Social Media Backlash

Naga Vamsi: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన తాజా కామెంట్స్ సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్‌ను వాయిదా వేయడం వెనుక ఉన్న అసలు నిజాన్ని ఆయన కుండబద్దలు కొట్టారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, నెగెటివ్ ట్రోలింగ్‌కు భయపడే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్వయంగా నిర్మాత నాగవంశీ అంగీకరించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంత క్లిష్టంగా మారాయో వివరిస్తూ, నిన్న ఆదివారం నాటికి విదేశాల్లో సెన్సార్‌కు అవసరమైన కాపీని కూడా అందించలేని పరిస్థితి ఏర్పడిందని నాగవంశీ పేర్కొన్నారు. సాధారణంగా అక్టోబర్ 9న సినిమాను రిలీజ్ చేస్తే, మరుసటి రోజు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్‌కి సెలవులు కలిసి వస్తాయన్నది నిర్మాతల మొదటి ఆలోచన. ప్రొడ్యూసర్‌గా సినిమాను అనుకున్న తేదీకే విడుదల చేసేయాలని తనకు కూడా బలంగా అనిపించిందని ఆయన తెలిపారు.

అయితే, ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా సృష్టించిన భయం అలాంటి ఆలోచనలకు అడ్డుకట్ట వేసిందని ఆయన స్పష్టం చేశారు. హడావుడిగా రిలీజ్ చేసి క్వాలిటీ తగ్గితే, వచ్చే బ్యాక్‌లాష్, నెటిజన్ల నుంచి ఎదురయ్యే ట్రోలింగ్ చాలా దారుణంగా ఉంటాయని, అందుకే ఆ భయంతోనే సినిమాను సేఫ్‌గా, పక్కాగా సినిమాను రెడీ చేసి ప్రేక్షకుల ముందుకు తేవాలనే ఉద్దేశంతో రిలీజ్ డేట్‌ను వాయిదా వేసుకున్నామని వివరించారు. ఈ నిర్ణయం వల్ల కొందరు తిట్టుకుంటారని తెలిసినా, రాజీ పడక తప్పలేదని నాగవంశీ తేల్చిచెప్పారు. విడుదల వాయిదా వల్ల ప్రాజెక్ట్‌ మరింత మెరుగ్గా వస్తుందా అన్న ప్రశ్నకు ఆయన పూర్తి భరోసా ఇచ్చారు. “ఇప్పుడున్న హడావుడిలో రిలీజ్ చేస్తే 80 శాతం అవుట్‌పుట్ మాత్రమే ఇవ్వగలను, అది రూపాయి వసూలు చేయొచ్చు. కానీ పూర్తి సమయం తీసుకుని 100 శాతం క్వాలిటీతో డెలివరీ చేస్తే, అదే సినిమా రూపాయి ఇరవై పైసలు రాబడుతుంది” అని నాగవంశీ నమ్మకం వ్యక్తం చేశారు. అభిమానులు ప్రస్తుతానికి కాస్త నిరాశకు గురైనా, వారికి వెండితెరపై ఉత్తమమైన క్వాలిటీతో కూడిన సినిమాను అందిస్తామన్న గ్యారెంటీ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.